ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీలోకి కీలక నాయకులు ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల్లో వైసీపీ కార్పొరేటర్లు, మేయర్లు, కౌన్సిలర్లు కూడా జెండా మార్చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఒంగోలు కార్పొరేషన్ లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేయూరి బుజ్జితో పాటు 12 మంది కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పారు.
ఇక ఇప్పుడు హిందూపురం వంతు వచ్చింది. హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజతో పాటు 9 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం పర్యటకు రావడంతో.. ఆయన ఆధ్వర్యంలోనే వారంతా తెలుగు దేశం కండువా కప్పుకున్నారు.
కాగా, మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. అయితే మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నుంచి 30 మంది కౌన్సిలర్లు విజయం సాధించారు. అలాగే 6 టీడీపీ సభ్యులు ఉండగా.. బీజేపీ, ఎంఐఎం తరఫున ఒక్కొక్కరు గెలిచారు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒకరు టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు వైసీపీ నుంచి 9 మంది కౌన్సిలర్లు చేరడంతో.. టీడీపీ బలం 18కి చేరింది.