ఆంధ్ర ప్రదేశ్ లో గత కొంతకాలంగా హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై జరుగుతున్న దాడులపై తీవ్ర విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వరుస ఘటనలపై వైసీపీ సర్కార్ తీరుపై విపక్షాలు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సీఎం జగన్ ఉదాసీన వైఖరి వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని పలువురు టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సీఎం జగన్ పై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని, రెచ్చగొడితే చూస్తూ ఊరుకోబోమని బాలయ్య షాకింగ్ కామెంట్లు చేశారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, ప్రభుత్వానికి కన్నుమిన్ను ఆనడం లేదని బాలయ్య నిప్పులు చెరిగారు. జగన్ సర్కార్ తీరు కనకపు సింహాసనం మీద శునకమును కూర్చోబెట్టినట్టుందని బాలయ్య బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రైతుల విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్యంగా వ్యవహరిస్తోందని, రైతుల పక్షపాతి అని చెప్పుకునే ప్రభుత్వం ఇదేనా అని బాలకృష్ణ విమర్శించారు. బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినవారు అన్ని వర్గాల వారిని విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమానికి సంసిద్ధం కావాలని రైతులకు బాలయ్య పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం రూ.3700 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చిందని, జగన్ ప్రభుత్వం రూ.277 కోట్లు ఇస్తే ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. ‘‘రెచ్చగొట్టకండి…రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని జగన్ సర్కార్ కు బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. మరి, బాలయ్య వ్యాఖ్యలపై జగన్ , వైసీపీ నేతల స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.