పిక్ టాక్: చైతూ చెవిలో సాయిపల్లవి సీక్రెట్

ప్రేమకథలు తీయడంలో శేఖర్ కమ్ముల శైలే వేరు. ‘ఆనంద్’ నుంచి ‘ఫిదా’ వరకు ఆయన సినిమాలు యువతను విశేషంగా ఆకట్టుకున్నవే. యూత్ ఈజీగా రిలేట్ చేసుకునేలా ప్రధాన పాత్రల్ని తీర్చిదిద్ది.. హృద్యమైన సన్నివేశాలతో ప్రేక్షకుల మనసులు దోస్తుంటాడు కమ్ముల. ఆయన్నుంచి రాబోతున్న ‘లవ్ స్టోరి’ మరింతగా యువతను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రతి ప్రోమో ఆకట్టుకుంది. ఇప్పుడు ‘లవ్ స్టోరి’ టీజర్ విడుదలకు ముహూర్తం కుదిరింది. జనవరి 10న ఉదయం పది గంటలకు ‘లవ్ స్టోరి’ టీజర్ విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ రిలీజ్ చేసిన సినిమా కొత్త లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ట్రాక్ ప్యాంట్, జాకెట్ వేసుకుని నిలబడి ఉన్న నాగచైతన్య చెవిలో పొద్దున జాగింగ్‌కు వెళ్తున్న డ్రెస్సులో ఉన్న సాయిపల్లవి ఏదో చెబుతున్నట్లుగా ఈ లుక్ డిజైన్ చేశారు. చూడగానే ఆకట్టుకునేలా, ఆసక్తి రేకెత్తించేలా ఉన్న ఈ పోస్టర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. చైతూ చెవిలో సాయిపల్లవి ఏం చెబుతోందబ్బా అని అంతా చర్చించుకుంటున్నారు. ఈ లుక్ సెటప్ అదీ చూస్తే సినిమాలో ఏదైనా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కూడా ఉందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రోమోల్లో శేఖర్ కమ్ముల కథ గురించి పెద్దగా సంకేతాలివ్వలేదు. చైతూ నిరాదరణకు గురైన పేద కుర్రాడిలా.. సాయిపల్లవి డబ్బున్న కుటుంబానికి చెందిన అమ్మాయిలా మాత్రమే కనిపించారు. మరి వీరి నేపథ్యం ఏంటి.. వీరి మధ్య బంధం ఎలాంటిది అన్నది టీజర్లో కొంత సంకేతాలు ఇచ్చే అవకాశముంది. టీజర్లో శేఖర్ మార్కు రొమాంటిక్ మూమెంట్స్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారనడంలో సందేహం లేదు. ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమాతోనే నిర్మాతగా మారుతున్నారు. ‘లవ్ స్టోరి’ ఫిబ్రవరిలో ప్రేమికుల దినోత్సవ కానుకగా.. లేదంటే వేసవిలో విడుదలయ్యే అవకాశముంది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.