ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కోసం ఆ ప్రాంతంలోని రైతులు స్వచ్ఛందంగా 33వేల ఎకరాల భూములను తృణప్రాయంగా త్యాగం చేసిన సంగతి తెలిసిందే. అయితే, టీడీపీని, ఒక సామాజిక వర్గాన్ని దెబ్బకొట్టేందుకు అమరావతిని నిర్వీర్యం చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతిలోని సీఆర్డీయే పరిధిలో రైతులు ఇచ్చిన భూములలో ఆర్-5 జోన్ అని క్రియేట్ చేసి రైతులు ఇచ్చిన భూములను పంచుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే ఆర్-5 జోన్ లో వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా నిరసనలు తెలపడం, ఆ నేపథ్యంలో తుళ్లూరులో 144 సెక్షన్ విధించడం, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం తెలిసిందే. తుళ్లూరులో డ్యూటీ చేస్తూ కానిస్టేబుల్ నాగరాజు పాముకాటుకు గురై మరణించడం వంటి ఘటనలు దుమారం రేపాయి. ఇంత జరిగినా సరే…అధికార పార్టీ అధినేత జగన్ తీరు మాత్రం మారలేదు. ఈ క్రమంలోనే నేడు అమరావతిలోని వివాదాస్పద ఆర్-5 జోన్ లో 50,793 మందికి జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇళ్ల పట్టాల పంపిణీని ముందు నుంచి వ్యతిరేకిస్తున్న అమరావతి రైతులు ఈ రోజులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ జీవనాధారమైన భూములను తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అమరావతి రాజధాని నిర్మాణానికి ఇచ్చామని, కానీ, ఇప్పుడు ఆర్-5 జోన్ పేరుతో ఇతరులకు ఇవ్వడం ఏంటి అని రైతులు నిలదీస్తున్నారు. అమరావతి కోసం భూములు త్యాగం చేస్తే తమకు లభించే ప్రతిఫలం ఇదా అని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి తమ ఉసురు తగలడం ఖాయమని శాపనార్థాలు పెట్టారు.
ఈ క్రమంలోనే పలు గ్రామాల్లో రైతులు నిరసనలు చేపట్టారు. అమరావతి జేఏసీ నల్ల రిబ్బన్లు, నల్ల దుస్తులతో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టింది. రాజధాని ప్రాంతంలోని ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిపై నల్ల జెండాలు ఎగరేయాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే ఆందోళన చేపట్టేందుకు తుళ్లూరు శిబిరం నుంచి బయటకు వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడి రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కారు అటుగా రావడంతో రైతులు దానిని అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆ కారును అక్కడ్నించి అతి కష్టం మీద పంపించారు.
మరోవైపు, వెలగపూడి శిబిరంలో నల్ల జెండాలు, నల్ల బెలూన్లలో మహిళలు, రైతులు నిరసన తెలిపారు. గో బ్యాక్ రాజధాని ద్రోహుల్లారా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మందడం శిబిరంలో ఉరితాళ్లతో రైతులు నిరసన తెలిపారు. ఈ ఆందోళనలను ముందుగానే ఊహించిన పోలీసులు… ప్రత్యేక నిఘాపెట్టి అమరావతి జేఏసీ నేతలు బయటికి రాకుండా ఎక్కడిక్కడ గృహ నిర్బంధం చేశారు.