ఇటీవల ముగిసిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ అభ్యర్థులను బెదిరించిన వైసీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, బెదిరింపులకు గురిచేసి నామినేషన్లు విత్ డ్రా చేయించారని ఆరోపణలు వచ్చాయి. ఇక, కొన్ని చోట్ల మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఎన్నిక విషయంలోనూ వైసీపీ మరోసారి అక్రమాలకు తెరలేపిందని విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలోనే కొండపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక విషయంలో చెలరేగిన వివాదం దుమారం రేపింది. ఈ ఎన్నిక సందర్భంగా నిన్న రసాభాస చేసిన వైసీపీ కౌన్సిలర్లు…నేడు కూడా విధ్వంసం సృష్టించారు. అయినప్పటికీ, మున్సిపల్ కార్యాలయంలోనే టీడీపీ సభ్యులు, ఎంపి కేశినేని నాని బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో, వైసీపీ సభ్యులు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఎన్నికల అధికారి సునీల్ కుమార్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు.
ఎంత సర్ది చెప్పినా సభ్యులు వినలేదని, దీంతో ఎన్నికకు అవకాశం లేకుండా పోయిందన్నాని సునీల్ వెల్లడించారు. అందుకే ఎన్నికను వాయిదా వేశామని తెలిపారు. అయితే, సునీల్ స్పందించకుండా వెళ్లిపోయారని టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది.
ఈ వ్యవహారంపై హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. విజయవాడ సీపీ, కొండపల్లి మున్సిపల్ కమిషనర్ కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. తాము ఆదేశించినా ఎన్నిక నిర్వహించకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిక ఎందుకు నిర్వహించలేకపోయారో చెప్పాలని హైకోర్టు నిలదీసింది. ఆ తర్వాత ఈ ఎన్నికకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
బుధవారం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలను నిర్వహించాలని, ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ ప్రకారం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అంతేకాదు, ఎన్నికైన అభ్యర్థులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని విజయవాడ పోలీసు కమీషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.
దీంతోపాటు, ఎంపీ కేశినేని నాని తన ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, కానీ, నాని ఓటు హక్కు కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని తెలిపింది. అప్పటి వరకు ఆ ఎన్నికల ఫలితాలను ప్రకటించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, ప్రతి సభ్యుడికి ప్రత్యేకంగా.. భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది.