సంగం డెయిరీ లావాదేవీల్లో అవకతవకలు జరిగాయంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ధూళిపాళ్లను అరెస్టు చేశారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ధూళిపాళ్లకు కరోనా రావడం, అనంతరం కోర్టు ఆదేశాలతో బెయిల్ మంజూరు కావడం జరిగిపోయాయి.
అయితే, సంగం డైరీపై కన్నేసిన జగన్ సర్కార్ ఎలాగైనా దానిని హస్తగతం చేసుకోవాలని స్కెచ్ వేసిందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే సంగం డెయిరీని ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుని.. తెనాలి ఆర్డీఓ అజమాయిషీలో నిర్వహించేందుకు వీలుగా ఏప్రిల్ 27న జీవో జారీ చేసింది. సంగం డెయిరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తి దారుల సహకార సంఘానికి బదిలీ చేసి సంగం డెయిరీ యాజమాన్య హక్కులను మారుస్తూ జీఓ జారీ అయింది.
అయితే, ఆ జీవోను కొట్టివేస్తూ, సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సంగం డెయిరీ కేసులో జగన్ సర్కార్ కు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని ఆదేశించిన హైకోర్టు…ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అప్పీల్ ను తిరస్కరించింది.
అంతేకాదు, ఈ అంశంపై విచారణలో తమను కూడా భాగస్వాములను చేయాలంటూ దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టివేసింది. సంగం డెయిరీ వ్యవహారంలో సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది. హైకోర్టు తాజా తీర్పుతో సంగం డెయిరీ యాజమాన్యానికి, ధూళిపాళ్ల నరేంద్రకు ఊరట లభించినట్లయింది. ఇక, సింగిల్ జడ్జి బెంచ్ తో పాటు డివిజనల్ బెంచ్ లో కూడా జగన్ కు షాక్ తగిలినట్లయింది.