జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గించారని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు నిర్మాతలు ఆ టికెట్ల రేట్ల పెంపు జీవో నెం.35 ను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించగా…వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే, ఆ తీర్పును జగన్ ప్రభుత్వం సవాల్ చేస్తూ హైకోర్టు డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించింది.
దీంతో, విచారణ జరిపిన హైకోర్టు తాజాగా నేడు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ల యజమానులు ముందు సంబంధిత జిల్లా జాయింట్ కలెక్టర్ కు పంపాలని కోర్టు ఆదేశించింది. ధరలపై జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. దీంతోపాటు, ధరల నిర్ణయంపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
హైకోర్టు తాజా నిర్ణయంతో టికెట్ రేట్ల పెంపు వ్యవహార మరోసారి థియేటర్ల యజమానుల చేతిలో లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. జాయింట్ కలెక్టర్ల చేతిలో అధికారం ఉంది కాబట్టి….దాదాపుగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే కొంచెం అటుఇటుగా పెట్టాల్సి వస్తుందేమోనని పలువురు థియేటర్ల యజమనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం జరగనున్న తదుపరి విచారణలో ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.