సంగం డెయిరీ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో నరేంద్ర కస్టడీని మరో వారం రోజులపాటు పొడిగించాలని కోర్టుకు ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ, ధూళిపాళ్ల కస్టడీని పొడిగించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. కస్టడీ పొడిగింపు అంశంపై అవినీతి నిరోధక శాఖ కోర్టు విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది.
సంగం డెయిరీ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను హైకోర్టు నిలిపివేసింది. ఆ జీవోను రద్దు చేయాలంటూ సంగం డెయిరీ డైరెక్టర్లు వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు… డైరెక్టర్లు సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని ఆదేశించింది. ఆ డెయిరీ స్థిర, చరాస్తులు అమ్మాలంటే కోర్టు అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. డెయిరీపై ఆధిపత్యం డైరెక్టర్లకే ఉంటుందని కోర్టు తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది.
అంతకుముందు, ఈ కేసు విచారణపై స్టే ఇవ్వాలని ధూళిపాళ్ల తరఫు న్యాయవాదులు కోరారు. డెయిరీ సమాచారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు పోలీసులు ఇస్తున్నారని పిటిషనర్ తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. మరోవైపు, ధూళిపాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో విచారణ జరపలేనిమని సీఐడీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే సంగం డెయిరీని ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవోను హైకోర్టు నిలిపివేసింది. దీంతో, జగన్ కు హైకోర్టు షాకిచ్చినట్లయింది.