జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో రాజా రెడ్డి రాజ్యాంగం అమలవుతోందని, జగన్ నియంత పాలన సాగిస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తనను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం…ఇదేంటని అడిగిన వారిని పోలీసు వ్యవస్థనుపయోగించి అణగదొక్కడం పరిపాటిగా మారిందని విపక్షాలు దుయ్యబడుతున్నాయి. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా కేసులు పెట్టడం, కేసు పెట్టిన వెంటనే పోలీసులు జగన్ టార్గెట్ చేసిన నేతల ఇళ్లకు వెళ్లి వారిని ఉన్నపళంగా అర్ధరాత్రో, అపరాత్రో అరెస్టు చేయడం సర్వ సాధారణమైంది.
గతంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ విషయంలో జగన్ సర్కార్ తీరు జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే మరోసారి రఘురామను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైందని పుకార్లు వస్తున్నాయి. దీంతో, ఈ వ్యవహారంపై రఘురామ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దానిపై విచారణ జరిపిన హైకోర్టు..జగన్ కు షాకిచ్చి రఘురామకు ఊరటనిచ్చింది.
ఏదైనా వ్యవహారంలో ఏ వ్యక్తిపై అయినా కేసు నమోదు చేస్తే, కేసు నమోదు చేసిన వెంటనే సదరు వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. కేసులు నమోదు చేసినా…వ్యక్తుల అరెస్ట్‌లో పోలీసులు చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 3,4 తేదీల్లో రఘురామపై కేసులు నమోదు చేసినా… అరెస్ట్ విషయంలో చట్టబద్ధ ప్రక్రియను అనుసరించాలని సూచించింది.
ఎంపీగా ప్రధాని మోదీ కార్యక్రమానికి వెళ్లవచ్చు కదా అని హైకోర్టు వ్యాఖ్యానించగా… పోలీసులు ఏదోలా తనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రఘురామ తెలిపారు. తాజా తీర్పుతో రఘురామను మరోసారి అరెస్టు చేసి ఇబ్బందిపెట్టాలనుకున్న జగన్ సర్కార్ పాచిక పారలేదన్న విమర్శలు వస్తున్నాయి.
కాగా, ఈ నెల 4న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. స్థానిక ఎంపీ హోదాలో ఈ కార్యక్రమానికి తాను హాజరు కావాల్సి ఉందని, కానీ, తనను ఈ కార్యక్రమంలో పాలుపంచుకోకుండా ముందుగానే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.