అమరావతిలోని ఆర్ 5 జోన్ లో పేదలకు జగనన్న ఇళ్ల స్థలాల కేటాయింపుల వ్యవహారంపై సందిగ్ధత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం చేపట్టడం సరికాదంటూ అమరావతి రైతులు కోర్టు తలుపు తట్టారు. అయితే, ఆ వ్యవహారం కోర్టులో పెండింగ్ లో ఉండగానే జగన్ హడావిడిగా 50 వేళ మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆ నిర్మాణాలను నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆ నిర్మాణ పనులపై స్టే విధిస్తూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నిర్మాణాలపై జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తాత్కాలిక స్టే విధించింది. రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఆర్-5 జోన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జగనన్న కాలనీల పేరుతో రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల పట్టాలను అందజేసింది.
అందుకుగాను అమరావతి రాజధాని ప్రాంతంలో 1400 ఎకరాలను కేటాయించింది. మొత్తం 50,793 మందికి ఇళ్ల నిర్మాణ పత్రాలను జగన్ సర్కార్ మంజూరు చేసింది. కానీ, ఆర్ 5 జోన్ ఎలక్ట్రానిక్ సిటీ అని, పేదలకు స్థలాలను మరోచోట ఇవ్వాలని అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు కోర్టును ఆశ్రయించారు. సీఆర్డీఏ ఒప్పందానికి ప్రభుత్వ నిర్ణయం తూట్లు పొడుస్తోందని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, వాటిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు తాజా తీర్పుతో ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం మొదలుబెట్టిన లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో పాటు అప్పుసప్పు చేసి ఇళ్లు కట్టడం మొదలుబెట్టిన వారు తలలు పట్టుకుంటున్నారు. ఇలా జరుగుతుందని టీడీపీ నేతలు ముందే హెచ్చరించినా…జగన్ సర్కార్ పెడచెవిన పెట్టి మరీ స్థలాలు మంజూరు చేసింది.