ఒక్క సినిమాతో సూపర్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకోవటం.. అది కూడా ఏదో ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా పలు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు సుపరిచితులుగా మారటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు కేజీఎఫ్ ఫేం యశ్. నాలుగేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 1లో అతగాడి హీరోయిజం ఆయన్ను అందరికి తెలిసేలా చేయటమే కాదు.. ఆ సినిమాతో యశ్ ఇమేజ్ పూర్తిగా మారింది.
ఇక.. కేజీఎఫ్ 2కు కొబ్బరికాయ కొట్టిన రోజు నుంచే.. ఈ సినిమా మీద ఉన్నన్ని అంచనాలు అన్ని ఇన్ని కావు. అనూహ్యంగా కరోనా కారణంగా.. ఈ సినిమా విడుదల ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ.. ఎట్టకేలకు గత వారం విడుదల కావటం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ట్రాన్స్ లో ఉన్న సినీ ప్రేక్షకులకు తన ఊర మాస్ యాక్షన్ తో తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు యశ్. దీంతో అందరూ అతని గురించి మాట్లాడుకునే పరిస్థితి.
ఇదిలా ఉంటే.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అగ్రహీరోగా ఎదగటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు యశ్. సాదాసీదా జీవితం నుంచి ఎన్నో కష్టాలు పడిన అతను.. ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితికి చేరుకున్నాడంటే.. దానికి సంబంధించిన క్రెడిట్ అంతా యశ్ కే చెందుతుంది.
ప్రస్తుతం తాను ఎంత పెద్ద స్టార్ అయినప్పటికి.. ఒకప్పుడు చాలా సాదాసీదా జీవితాన్ని తాను గడిపిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని.. అప్పటి రోజుల్ని కళ్లకు కట్టినట్లుగా చెబుతుంటారు. సినిమాల మీద ఉన్న మోజుతో.. ఈ రంగంలోకి రావాలని చెప్పినప్పుడు తన తండ్రి తనకు కొంత టైం ఇచ్చి.. ఆ లోపు ఫ్రూవ్ చేసుకోవాలని చెప్పారని.. లేదంటే తాను చెప్పినట్లుగా ఉద్యోగం చేయాలన్న విషయాన్ని ఆయనిప్పుడు గుర్తు చేసుకున్నారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలోని ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన యశ్ తండ్రి బస్ డ్రైవర్ గా పని చేసేవారు.
సినిమాల మీద కొడుక్కి ఉన్న ఆసక్తిని కాదనలేక.. కొంత గడువులో ఫ్రూవ్ చేసుకోవాలని చెప్పి బెంగళూరుకు పంపిన వైనాన్ని గుర్తు చేసుకున్న యశ్ ఎమోషన్ అయ్యారు. తండ్రి మాటతో జేబులో రూ.300 పెట్టుకొని గార్డెన్ సిటీకి వచ్చిన యశ్.. మొదట్లో సీరియల్స్ లో పని చేశారు. మెల్లగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2008లో రాకీ మూవీతో హీరోగా అప్ గ్రేడ్ అయిన ఆయన.. కేజీఎఫ్ పుణ్యమా అని ఒక్కసారిగా సూపర్ స్టార్ అయిపోయిన యశ్.. ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాదు.. టాలీవుడ్.. బాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే యశ్ మరిన్ని విజయాల్ని సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.