భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్పై కోలీవుడ్ నటుడు సిద్ధార్థ్ చేసిన కామెంట్లు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వివాదంలో సిద్ధార్థ్ తీరును పలువురు ప్రముఖులతోసహా జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా తప్పుబట్టింది. అంతేకాదు, సిద్ధార్థ్ ట్విటర్ ఖాతాను బ్లాక్ చేయాలని ట్విటర్ ఇండియాకు ఎన్ సీ డబ్ల్యూ చైర్మన్ రేఖ లేఖ రాశారు. ఈ క్రమంలోనే ముందుగా తన వ్యాఖ్యలను సమర్థించుకున్న సిద్ధార్థ్ …చివరకు దిగి వచ్చాడు.
సైనాకు సారీ చెబుతూ సిద్ధార్థ్ ఓ లేఖను ట్వీట్ చేశాడు. సైనాపై తాను వేసింది బ్యాడ్ జోక్ అని బొమ్మరిల్లు హీరో అంగీకరించాడు. కానీ, తన ట్వీట్లో లింగవివక్ష లేదని సిద్ధూ మరోసారి అన్నారు. తాను చాలా విషయాల్లో సైనాతో ఏకీభవించకపోవచ్చని, కానీ, ఆ ట్వీట్ చూసిన వెంటనే తనకు వచ్చిన కోపం, తాను నిరాశకు గురికావడం వంటి కారణాలు తాను ఉపయోగించిన భాషను సమర్థించలేవని చెప్పారు.
తాను స్త్రీవాద మిత్రుడినని, సైనా మహిళ కాబట్టి ఆమెపై ఆ కోణంలో దాడి చేయాలనే ఉద్దేశం తనకు లేదని సిద్ధార్థ్ చెప్పారు. ఇక, ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలికి, తన క్షమాపణల లేఖను స్వీకరిస్తారని ఆశిస్తున్నానంటూ సిద్ధూ లేఖలో రాశరరు. సైనా ఎప్పటికీ తన ఛాంపియన్గా ఉంటారన్నాడు. అంతకుముందు,.సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పాలని సైనా నెహ్వాల్ తండ్రి హర్వీర్ సింగ్ నెహ్వాల్ కన్నీటి పర్యంతమవుతూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిద్ధూ క్షమాపణల లేఖపై సైనా, హర్వీర్, పారుపల్లి కశ్యప్ ఎలా స్పందిస్తారో చూడాలి.