జనవరి 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం ఘటన దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రధాని కాన్వాయన్ ను రైతులు అడ్డగించి నిరసన వ్యక్తం చేయడం సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ స్పందిస్తూ…ప్రధాని భద్రతకే భంగం కలిగిందంటే…ఆ దేశం సురక్షితంగా ఉండదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ పై కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ స్పందిస్తూ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది.
”సబ్టిల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్.. థ్యాంక్స్ గాడ్…మాకు ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా ఉన్నారు…షేమ్ ఆన్ యూ…#రిహన్నా” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేదితో సహా పలువురు ప్రముఖులు మండిపడ్డారు. ఈ ట్వీట్ పై జాతీయ మహిళ కమిషన్ కూడా సిద్దార్థ్కు నోటిసులు జారీ చేసింది. ఆ ట్వీట్ ను తొలగించాలని, సిద్ధార్థ్ ఖాతాను బ్లాక్ చేయాలని ట్వీటర్ కు లేఖ రాసింది.
ఇక, గతంలో మహిళలు పోరాడే అనేక అంశాల్లో సిద్ధార్థ్ ఎంతో మద్దతు ఇచ్చాడని, ఇప్పుడిలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని గాయని చిన్మయి శ్రీపాద అన్నారు. కానీ, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఇలాంటి అంశాలపై దుష్ప్రచారం చేసేందుకు భారీ యంత్రాంగం ఉంటుందన్న విషయం ఈ ఘటనతో అర్థమైందని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామని చిన్మయి పిలుపునిచ్చారు.
అయితే, తాను సైనాను అవమానించే ఉద్దేశ్యంతో ఆ కామెంట్ చేయలేదని, అదొక జాతీయాన్ని పోలిన విమర్శ అని, దానిని తప్పుగా అర్థం చేసుకున్నారని సిద్ధార్థ్ వివరణనిచ్చారు. కానీ, ఆ కామెంట్ తనను బాధించిందని సైనా చెప్పింది. సిద్ధార్థ్ అంటే హీరోగా తనకూ ఇష్టమని, తనపై విమర్శలు చేసేందుకు వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని చెప్పింది.