టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన టాలీవుడ్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి నార్సింగి పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై రాజ్ తరుణ్ తాజాగా స్పందించారు. లావణ్య వ్యవహారంలో తన తప్పేమీ లేదు కాబట్టి తాను ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని అన్నారు. ఆ అమ్మాయిని తాను మోసం చేశాను అనడంలో నిజం లేదని చెప్పారు.
లావణ్యతో తాను 2014 నుంచి 2017 వరకు రిలేషన్ లో ఉన్నానని అన్నారు. అయితే, ఆ తర్వాత లావణ్యతో ఎటువంటి శారీరక సంబంధం గానీ, మరే రిలేషన్ గానీ లేదని క్లారిటీనిచ్చారు. అయితే, లావణ్య ది బ్లాక్ మెయిలింగ్ స్వభావమని, తనను బెదిరిస్తూ ఉండేదని చెప్పుకొచ్చారు. పరువు కోసం ఇవన్నీ తాను భరించానని అన్నారు. ఆ తర్వాత ఆమె డ్రగ్స్ కు అలవాటు పడిందని, ఆమెపై డ్రగ్స్ కేసు కూడా నమోదైందని చెప్పుకొచ్చారు. అయితే, ఆ డ్రగ్స్ కేసు తాను పెట్టించినట్లుగా లావణ్య ఆరోపించిందని మండిపడ్డారు.
తనను కొట్టిన బాయ్ ఫ్రెండ్ పైన కేసు పెట్టి మళ్ళీ అతడితోనే ఉంటుందని, అది కూడా తన ఇంట్లో అని చెప్పారు. లావణ్యను గుడిలో పెళ్లి చేసుకున్నానని చెప్పడం పచ్చి అబద్ధమని, తన జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసని అన్నాడు. భవిష్యత్తులో పెళ్లి చేసుకోవచ్చేమో కానీ ఇప్పటివరకు పెళ్లి ఆలోచన లేదని అన్నాడు. తాను డ్రగ్స్ జోలికి వెళ్లలేదని ఈ విషయం కాలర్ ఎగరేసి మరీ చెబుతానని అన్నారు.