టాలీవుడ్ దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున హఠాత్తుగా కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే కృష్ణ కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, కృష్ణకు స్వల్పంగా గుండెపోటు వచ్చిందని ఈ క్రమంలోనే ఐసియూకు తరలించి చికిత్స అందించామని వైద్యులు తాజాగా వెల్లడించారు.
ఈ క్రమంలోనే కృష్ణకు చికిత్స అందించామని, ఆ తర్వాత ఆయన కార్డియాక్ అరెస్ట్ నుంచి బయట పడ్డారని వైద్యులు వెల్లడించారు. అయితే, ఈరోజు మధ్యాహ్నం సమయానికి కృష్ణ ఆరోగ్యం పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు. మరో 48 గంటలు గడిస్తేగాని ఏ విషయం చెప్పలేమని వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అయితే, కృష్ణ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తుంటామని వారు అన్నారు.
ఇక, కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందన్న వార్తల నేపథ్యంలో ఆయన టాలీవుడ్ లోని పలువురు షాక్ అయ్యారు. కృష్ణ అభిమానులతో పాటు మహేష్ బాబు అభిమానులు కూడా సూపర్ స్టార్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కృష్ణ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.