సూపర్ స్టార్ కృష్ణ హఠాన్మరణానికి సంతాపంగా చలనచిత్ర పరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు కృష్ణ అంత్యక్రియల సందర్భంగా షూటింగ్ లు మొత్తం బంద్ చేస్తూ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ఇక, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ రేపు మార్నింగ్ షోలను బంద్ చేస్తూ థియేటర్ల యజమానుల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇక, కృష్ణ మృతికి సంతాపంగా సినిమా షూటింగ్ లు తాత్కాలికంగా నిలిపివేయాలని టాలీవుడ్ నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.
కృష్ణ మృతికి సంతాపంగా రేపు బుధవారం నాడు సినీ పరిశ్రమ కార్యక్రమాలు, షూటింగులు రద్దు చేసుకోవాలని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చేసిన విజ్ఞప్తి మేరకు నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, బుధవారం నాడు విజయవాడ నగర పరిధిలో సినిమా ప్రదర్శనలు మొత్తాన్ని నిలిపివేస్తున్నట్టుగా ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. నగరంలోని అన్ని సినిమా హాళ్లలో షోలను రద్దు చేసినట్టుగా ప్రకటించింది. ఈ కష్ట సమయంలో ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, తమకు సహకరించాలని కోరింది. ఏలూరుతోపాటు విజయవాడ నగరంతో కృష్ణకు మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఫిలిం ఛాంబర్ తన ప్రకటనలో వెల్లడించింది.
కాగా, కృష్ణ భౌతిక కాయానికి ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహించాలని తొిలుత భావించారు. రమేష్‌బాబు తనయుడు విదేశాల నుంచి రావడానికి ఆలస్యమవుతుందేమోనన్న కారణంతో గురువారం నాడు అంత్యక్రియలు చేద్దామనుకున్నారు. అయితే, రేపు మధ్యాహ్నం సమయానికి కృష్ణ మనవడు వచ్చే అవకాశం ఉండడంతో బుధవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించాలనుకుంటున్నారు.