ఔను.. ఏ క్షణమైనా జార్ఖండ్ రాష్ట్ర సీఎం, యువ నాయకుడు హేమంత్ సొరేన్ అరెస్టు కానున్నా రు. ఇప్పటికే ఆయన అరెస్టు అయ్యే అవకాశం ఉండడంతో ఆయన చుట్టుపక్కల భారీ ఎత్తున కేంద్ర బలగాలను మోహరించారు. దీనికి తోడు రాష్ట్ర పోలీసులను కూడా ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలో హేమంత్ అరెస్టు అనివార్యంగా మారింది. ఇదే జరిగితే.. ఆయన సతీమణి.. కల్పన ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్నారని తెలిసింది.
విషయం ఇదీ..
81స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీకి 2019 నవంబరులో ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో స్థానిక పార్టీగా జేఎంఎం(జార్ఖండ్ ముక్తి మోర్చా) మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. అయితే.. 17 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా.. ప్రభుత్వంలో భాగస్వామైంది. మొత్తంగా జేఎంఎం కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ పాలన సాగిస్తోంది. అయితే.. తరచుగా సొరేన్ కేంద్రంలోని మోడీ సర్కారుపై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. రాష్ట్రంలో బీజేపీని లేకుండా చేయడమే తన ధ్యేయమని ఆయన తరచుగా చెబుతున్నారు.
ఇదిలావుంటే.. 2020-21 మధ్యకాలంలో భూకుంభకోణం, మనీలాండరింగ్ జరిగాయని.. దీనిలో సీఎం పాత్ర నేరుగాఉందని ఆరోపిస్తూ.. ఈడీ అధికారులు 2023 ప్రారంభంలో కేసు నమోదు చేశారు. దీనిపై అనేక దఫాలుగా విచారణ చేపట్టారు. ఇక, ఈ కేసులో సీఎం పాత్ర ఉందని పేర్కొంటూ.. ఆయనకు పలు మార్లు నోటీసులు ఇచ్చారు. ఇలా నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ.. సీఎం హేమంత్ మరింతగా బీజేపీపైనా.. మోడీపైనా విమర్శలు గుప్పించడం ప్రారంభించారు.
ఇక, ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న నేపథ్యంలో తాజాగా పదోసారి కూడా నోటీసులు ఇచ్చిన ఈడీ. ఆయన కోసం గాలిస్తోంది. గత 35 గంటలు(రోజున్నర)గా కనిపించకుండా ఉన్న సీఎం హేమంత్.. అనూహ్యంగా పార్టీ లెజిస్లేచర్ మీటింగ్ కు పిలుపునిచ్చారు. ఈ విషయం తెలిసి.. ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేసేందుకు రెడీ అయ్యారు.
ఇక, లెజిస్టేచర్ మీటింగ్లో తన తర్వాత.. పార్టీ బాధ్యతలను తన భార్య కల్పన కు అప్పగించనున్నట్టు సీఎం హేమంత్ వెల్లడించారు. దీనికి కాంగ్రెస్ సభ్యులు సైతం అంగీకరించారని సమాచారం. దీంతో హేమంత్ కనుక ఏ క్షణం అరెస్టయినా.. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయడంతోపాటు తన సతీమణి కల్పనతో ప్రమాణ స్వీకారం చేయించి రాష్ట్రపగ్గాలు అప్పగించనున్నారు. ఇదీ.. సంగతి!