రెండు సంస్థల విలీనం కొత్త ఊపుగా మారటమే కాదు.. సెన్సెక్స్ ను సైతం ఊరుకులాడేలా చేయటమే కాదు.. భారీ బ్యాకింగ్ దిగ్గజ సంస్థ ఏర్పాటుకు కారణమైంది. దేశంలోనే అతి పెద్ద గృహ రుణాల సంస్థ హెచ్ డీఎఫ్ సీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అదే సమయంలో దేశంలోనే అతి పెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులోకి విలీనం అవుతున్న వైనం స్టాక్ మార్కెట్ కు సరికొత్త ఉత్సాహాన్ని.. ఊపును ఇచ్చింది. ఈ రెండు సంస్థల విలీనం పుణ్యమా అని దేశంలో భారీ బ్యాంకింగ్ దిగ్గజం ఒకటి అవతరించినట్లు చెప్పాలి. 40 బిలియన్ డాలర్ల ఒప్పందం విలువతో మొత్తం రూ.3.3 లక్షల కోట్ల నికర విలువతో రూ.18లక్షల కోట్ల బ్యాలెన్స్ షీట్ సంస్థగా అవతరించింది.
దేశ చరిత్రలోనే అతి పెద్ద విలీనంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ రెండు సంస్థల విలీనానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఈ రెండు షేర్లు దూసుకెళ్లాయి. ఒకదశలో హెచ్ డీఎఫ్ సీ షేరు రూ.2855.35 గరిష్ఠాన్ని తాకి చివరకు రూ.2678.90కు స్థిరపడింది. అదే సమయంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు షేరు రూ.1656.45 వద్ద ముగిసింది. ఈ రెండు సంస్థలు విలీనం కావటంతో ఈ సంస్థల మార్కెట్ విలువ టెక్ దిగ్గజ సంస్థ అయినా టీసీఎస్ మార్కెట్ విలువను దాటేసిందని చెప్పాలి.
మార్కెట్ అంచనాల ప్రకారం టీసీఎస్ మార్కెట్ విలువ రూ.13,79,389 కోట్లు కాగా.. తాజా విలీనంతో హెచ్ డీఎఫ్ సీ.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మార్కెట్ విలువ సంయుక్తంగా రూ.14,04,282 కోట్లకు చేరుకుంది. ఈ విలీనం రెండు సంస్థల్లో పని చేసే ఉద్యోగుల మీద ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ ఈ రెండు సంస్థల ఒప్పందం ఏమిటన్నది చూస్తే..
ప్రమోటర్ హోదాలో ఉన్న హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో 21 శాతం వాటా ఉన్న హెచ్ డీఎఫ్ సీ.. తన రెండు అనుబంధ కంపెనీలు (హెచ్ డీఎఫ్ సీ హోల్డింగ్స్, హెచ్ డీఎఫ్ సీ ఇన్వెస్ట్ మెంట్స్) విలీనం కానున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు 100 శాతం పబ్లిక్ వాటాదారు సొంతమవుతుంది. ప్రస్తుతం బ్యాంకులో హెచ్ డీఎఫ్ సీ వాటాదారులకు 41 శాతం వాటా దక్కనుంది.
హెచ్ డీఎఫ్ సీ వాటాదార్లకు ప్రతి పాతిక షేర్లకు 42 హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు షేర్లు బదిలీ చేస్తారు. హెచ్ డీఎఫ్ సీ షేరు ముఖ విలువ రూ.2 కాగా ప్రస్తుతం మార్కెట్ విలువ రూ.2855గా ఉంది. అదే సమయంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు షేర్ ముఖ విలువ రూపాయి కాగా.. దాని మార్కెట్ విలువ రూ.1656గా ఉంది. విలీన ప్రక్రియ మొత్తం 2024-24 రెండో త్రైమాసికం కానీ మూడో త్రైమాసికంలో కానీ పూర్తి అవుతుందని చెబుతున్నారు.
ఈ విలీనంతో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టటానికి అవకాశం ఉందంటున్నారు. హెచ్ డీఎఫ్ సీకి మొత్తం ఆస్తులు రూ.6.23లక్షల కోట్లు ఉంటే.. దాని నికర విలువ రూ.1.15 లక్షల కోట్లుగా చెబుతారు. ఇక.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు విషయానికి వస్తే దాని మొత్తం ఆస్తులు రూ.19.38 లక్షల కోట్లు అయితే.. దాని నికర విలువ రూ.2.23 లక్షల కోట్లు. ఏమైనా.. తాజా విలీన నిర్ణయం స్టాక్ మార్కెట్ ఉరకలేసేందుకు సాయం చేస్తుందని మాత్రం కచ్ఛితంగా చెప్పొచ్చు.