తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేయించడం ఏమిటని, కేసీఆర్ లాంటి పిరికి సీఎంని ఎక్కడా చూడలేదని అన్నారు. తాను కూడా 4 సార్లు సీఎం అయ్యానని, కానీ, కేసీఆర్ లా ఎప్పుడూ సంస్కారహీనంగా ప్రవర్తించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, పులి..ఎలుక అంటూ కేసీఆర్ పై ఓ పిట్టకథ కూడా చెప్పారు. ఈ క్రమంలోనే శివరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.
శివరాజ్ సింగ్ అవాకులు, చెవాకులు పేలుతున్నారని, 100 ఎలుకలను తిన్న పిల్లి తాను శాకాహారి అన్నట్లుగా చౌహాన్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని సీఎం అయిన చరిత్ర ఆయనదంటూ చురకలంటించారు. తెలంగాణతో మధ్యప్రదేశ్ కు పోలికేమిటని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ లో ‘వ్యాపం’ కుంభకోణంలో ఇప్పటివరకు ఎవరికైనా శిక్ష పడిందా? అని ప్రశ్నించారు.
ఆ కుంభకోణంతో శివరాజ్ కుటుంబానికి, బీజేపీ నేతలకు సంబంధం ఉందనే ఆరోపణలను గుర్తు చేశారు. ఏది ఏమైనా, కేసీఆర్ ను కొందరు పక్క రాష్ట్రాల బీజేపీ నేతలు కూడా టార్గెట్ చేసి విమర్శలు చేయడం కేసీఆర్ అండ్ కోకు కొత్త అనుభవమని చెప్పవచ్చు. అయితే, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాపై కేటీఆర్ చేసిన విమర్శలకు కౌంటర్ గానే పక్క రాష్ట్రాల బీజేపీ నేతలు సీన్ లోకి ఎంటరయ్యారని టాక్ వస్తోంది.