తెలివిగా మాట్లాడినట్లుగా ఫీల్ అవుతూ.. తమ అతితెలివినంతా ప్రదర్శించే ధోరణి కొందరు రాజకీయ నేతలు చేస్తుంటారు. అలాంటి వారంటే అవగాహన లేకుండా మాట్లడారని సర్దిచెప్పుకోవచ్చు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేనల్లుడు.. సీనియర్ నేత.. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న మాటకారి హరీశ్ రావు నోటి నుంచి తప్పులు వస్తే ఎలా తట్టుకోగలం.
గతంలో హరీశ్ నోటి నుంచి ఏదైనా వాదన వస్తే.. దాన్ని తిప్పి కొట్టటం చాలా కష్టంగా ఉండేది. నిజమే చెబుతున్నారు కదా? న్యాయమే మాట్లాడుతున్నారు కదా? అన్నట్లుగా ఆయన తీరు ఉండేది.
ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలో రాజ్యాధికారానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. అందులో భాగంగా కేంద్ర నాయకత్వం తమ నేతల్ని తెలంగాణకు పెద్ద ఎత్తున పంపిస్తోంది. తాజగా బీజేపీ చీఫ్ నడ్డా తెలంగాణకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితులపై మంత్రి హరీశ్ రావు ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికలు రాగానే రాష్ట్రానికి టూరిస్ట్ నాయకులు క్యూ కడుతున్నారని వ్యాఖ్యానించారు.
తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి తపిస్తుంటే.. అనారోగ్య రాజకీయాల కోసం ప్రతిపక్షాలు తపిస్తున్నాయన్న ఆయన.. బీజేపీ నేతలు తెలంగాణలో పర్యటించటాన్ని తప్పు పట్టారు. హరీశ్ ఆగ్రహం అదే అయితే.. తాము కూడా ప్రాంతీయపార్టీ నుంచి జాతీయ పార్టీగా అప్ గ్రేడ్ కావటమే కాదు.. ఇతర రాష్ట్రాల్లో రాజ్యాధికారం కోసం తెగ ప్రయత్నం చేస్తున్న విషయం మీద హరీశ్ ఏమంటారు? బీజేపీ జాతీయ నేతలు ఎలా అయితే తెలంగాణకు వస్తున్నారో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం పలు రాష్ట్రాలకు వెళుతున్నారు. ప్రసంగాలు చేస్తున్నారు.
తెలంగాణకు వచ్చి రాజకీయం చేయాలనుకునే వారు పొలిటికల్ టూరిస్టులు అయితే.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి రాజకీయం చేస్తున్న కేసీఆర్ కూడా టూరిస్టు కిందకే వస్తారా? తాము చేస్తే నీతి.. ఎదుటోడు చేస్తే.. అదో పనికిమాలిన పనిగా పేర్కొనటం హరీశ్ లాంటి సీనియర్ నేతకు సూట్ అవుతుందా? అన్నది ప్రశ్నగా మారింది. రాజకీయ ప్రత్యర్థుల తప్పుల్ని ఎత్తి చూపటం తప్పేం కాదు. కానీ.. ఇంత పేలవంగా వాదనలు ఉండటంతోనే అసలు సమస్యగా పేర్కొంటున్నారు. కాస్త బలమైన వాదనల్నిసిద్ధం చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది హరీశ్.