ఏపీ కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ ప్రకారం తాజాగా నేడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జనవరి 31తో ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ముగియనుంది. ఫిబ్రవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు హరీశ్ కుమార్ గుప్తా డీజీపీగా కొనసాగే అవకాశముంది.
తన నియామకం తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుతో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవానికి ద్వారకా తిరుమలరావు తర్వాత సీనియారిటీ జాబితాలో 1991 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉన్నారు. హరీశ్ కుమార్ గుప్తా రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు.
అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీ ఇన్ చార్జ్ డీజీపీగా పనిచేసిన అనుభవం ఉన్న హరీష్ కుమార్ గుప్తావైపే చంద్రబాబు మొగ్గు చూపారని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కూడా గుప్తా కన్నా సీనియారిటీ ఉన్న ఐపీఎస్ లను కాదని ఆయన వైపే ఈసీ మొగ్గు చూపడం విశేషం.