వాలంటీర్ల వ్యవస్థపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఏపీలో రాజకీయ కాక రేపిన సంగతి తెలిసిందే. ఏదో ఒకరోజు ఫ్లోలో కామెంట్లు చేశాం అన్న రీతిలో కాకుండా పక్కాగా పవన్ వాలంటీర్ల వ్యవస్థపై సంధిస్తున్న ప్రశ్నలు అధికార పార్టీని ఇరకాటంలో పడేశాయి. ఇక, ఎన్డీఏ మిత్ర పక్షాల భేటీకి వెళ్లిన పవన్ జాతీయ మీడియా ముందు కూడా ‘వాలంటీర్ వ్యవస్థ’ ప్రస్తావన తేవడంతో ఆ వ్యవహారం నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. వాలంటీర్లపై పవన్ కామెంట్స్ ను వైసీపీ నేతలు ఖండిస్తుంటే…కాపు నేతలు పవన్ కు బాసటగా నిలుస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా పవన్ కు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్‌కు తాజాగా మరో లేఖ రాశారు. వాలంటీర్ల సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అతి తక్కువ జీతంతో వాలంటీర్లు బ్రతుకుతున్నారని, ఎంతమందికి ప్రభుత్వం ఉపాధి కల్పిస్తోందని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన వారే వాలంటీర్లలో ఎక్కువమంది ఉన్నారని, ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లను ఉపసంహరించుకోవాలని జీవో కూడా ఇచ్చారని గుర్తు చేశారు.
వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న పవన్ సంకల్పం మంచిదేనని, కానీ, దానిపై పునరాలోచిస్తే మంచిదని హితవు పలికారు. వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా రద్దు చేయడానికి బదులు, కొన్ని మార్పులు చేర్పులతో పునర్నిర్మించుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. వాలంటీర్లకు కనీసం 10వ తరగతి విద్యార్హత, కనీస వేతనం రూ.10 వేలు ఉండాలని కోరారు. రాజకీయ పార్టీలకు చెందిన వారిని వాలంటీర్లుగా నియమించకూడదని డిమాండ్ చేశారు. 21 నుండి 30 సంవత్సరాల లోపు వారే ఆ ఉద్యోగానికి అర్హులుగా నిర్ణయించాలన్నారు.