రాజధాని అమరావతిలో గత టీడీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు తిరిగి ఊపిరి పోసుకుంది. నేలపాడులో 14.5 ఎకరాల విస్తీర్ణంలో జీ+18 అంతస్థులతో మొత్తం 12 టవర్లతో కూడిన 1,200 ఫ్లాట్లను డిజైన్ అండ్ బిల్డ్ విధానంలో చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. సవరించిన అంచనాలతో రూ.950 కోట్ల వ్యయంతో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ)ను విడుదల చేసింది. తాజాగా 12 టవర్లలో అంతర్గతంగా చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా రూ.770 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు.
అల్యూమినియం ఫ్రేమ్ వర్క్స్, పోడియం, ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ పనులు, అంతర్గత- బహిర్గత ఎలక్ర్టికల్ పనులు, ప్లంబింగ్, శానిటరీ, ల్యాండ్ స్కేపింగ్, ఫైర్ ఫైటింగ్, లిఫ్టుల ఏర్పాటు, డీజీసెట్ల ఏర్పాటు, హెచ్‌వీఏసీ, సెక్యూరిటీ సిస్టమ్స్, బహిర్గత డెవలప్మెంట్ వర్క్స్, ఎల్పీజీ వంటి అనేక పనులు చేపట్టేందుకు వీలుగా రూ.770 కోట్ల 94 లక్షల, 82 వేల 344 వ్యయంతో టెండర్లు పిలిచారు. టెండర్లలో భాగంగా బిడ్ల సమర్పణకు అక్టోబరు 4వ తేదీ 2 గంటల వరకు సమయాన్ని ఇచ్చారు.
అదే రోజున 3 గంటలకు టెండర్లు ఖరారు చేస్తారు. అలాగే సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని పూర్తి చేసేందుకు ఇటీవలే రూ.166 కోట్ల వ్యయంతో టెండర్లు పిలువగా.. తాజాగా ఇంటర్నల్ ఫినిషింగ్ వర్క్స్, ఐసీటీ వర్క్స్, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ వర్క్స్ కోసం 129.69 కోట్లతో టెండర్లు పిలిచారు. 2019లో గద్దెనెక్కిన జగన్ వచ్చీరాగానే రాజధాని అమరావతి నిర్మాణ పనులన్నీ నిలిపివేశారు. వాటి తరహాలోనే హ్యాపీనెస్ట్‌కు కూడా పాతర వేశారు. అయితే ఇది సీఆర్డీఏ చేపట్టిన టౌన్షిప్ ప్రాజెక్టు కాబట్టి దీనిని చేపట్టకపోవటాన్ని నిరసిస్తూ లబ్ధిదారులు రియల్ ఎస్టేట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)కు ఫిర్యాదు చేశారు.
దీనిపై సీఆర్డీఏ ఈ ప్రాజెక్టు చేపట్టాల్సిందేనని రెరా ఆదేశించినా.. జ్యూడీషియల్ ప్రివ్యూ కమిటీ పేరుతో కొంత కాలం.. రీ టెండర్ల పేరుతో మరికొంత కాలం సాగదీస్తూ జగన్ ప్రభుత్వం ఐదేళ్లూ గడిపేసింది. చంద్రబాబు మళ్లీ సీఎంగా వచ్చీరాగానే ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. అయుతే జగన్ నిర్వాకంతో మళ్లీ హ్యాపీనెస్ట్‌కు టెండర్లు పిలవడానికి మరో రూ.230 కోట్ల అదనపు భారం సీఆర్డీఏపై పడుతోంది. అయినా ఈ భారాన్ని ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమవుతోంది.
దీంతో హ్యాపీనెస్ట్ లబ్ధిదారులపై నయా పైసా కూడా భారం పడే అవకాశం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన క్షణం నుంచి అమరావతి నిర్మాణ పనులకు సంబంధించిన సమస్యలన్నింటినీ విశ్లేషిస్తూ, వాటికి సమాధానాలు కనుగొంటూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును సత్వరం ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది.
1,200 ప్లాట్లకు లక్షన్నర మంది దరఖాస్తు..
అమరావతి మెగా అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు హ్యాపీనెస్ట్ వంటి వినూత్న తరహా ప్రాజెక్టుకు 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది. బయటి ప్రాంతాల ప్రజలు కూడా రాజధానిలో అందుబాటు ధరలకు ఇళ్లు కొనుక్కునేందుకు వీలుగా సీఆర్డీఏ నేతృత్వాన మెగా టౌన్షిప్ నిర్మాణ ప్రాజెక్టుగా హ్యాపీనెస్ట్‌ను తీసుకొచ్చారు. రాజధానిలోని నేలపాడులో 14.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు కడతామని ప్రకటించారు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని.. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రాజెక్టులో మొత్తం 1,200 ప్లాట్లే అందుబాటులో ఉన్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర మందికి పైగా దరఖాస్తు చేయడం విశేషం.
వీరిలో 1,200 మందిని ఎంపిక చేశారు. వారి దగ్గర పూచీకత్తు డిపాజిట్ కూడా కట్టించుకున్నారు. పనుల కోసం గత టీడీపీ ప్రభుత్వంలోనే టెండర్లు కూడా పిలిచారు. ఆ సమయంలోనే ఎన్నికలు జరిగి.. జగన్ అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టుకు కూడా గండి పడింది. గత ఐదేళ్లలో లబ్ధిదారులు అలుపెరుగని పోరాటం చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న ఉద్దేశంతో రెరా వంటి సంస్థను ఆశ్రయించి న్యాయపోరాటం చేశారే తప్ప బయటకు వచ్చి ఆందోళన చేయలేదు. ప్రభుత్వం మారుతుందని, ఎప్పటికైనా తమ కలల ప్రాజెక్టు పనులు మళ్లీ మొదలవుతాయన్న ఆశతో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగేందుకు ఎవరూ సిద్ధపడలేదు.
అమరావతికి మణిమకుటం..
హ్యాపీనెస్ట్ అమరావతికే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచే టౌన్షిప్! 12 టవర్లతో ఒక్కోటి జీ+18 విధానంలో పక్కపక్కనే ఉంటాయి. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 12 రకాల కేటగిరీలతో కూడిన ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది. 1,225 చదరపు అడుగుల డబుల్ బెడ్రూం ఫ్లాట్లు 8.. 1,295 చ.అడుగుల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 136.. 1,510 చ.అడుగుల ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 40.. 1590 చ.అడుగుల ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 408, 1,630 చ.అడుగుల ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 32.. 1,710 చ.అడుగుల ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 272.. 1,870 చ.అడుగుల ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 16.. 1,980 చ.అడుగుల విస్తీర్ణం కలిగిన ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 136.. 2,120 చ.అడుగుల విస్తీర్ణం కలిగిన ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ 8, 2,245 చ.అడుగుల ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 68.. 2,640 చ.అడుగుల ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 8.. 2,750 చ.అడుగుల విస్తీర్ణం కలిగిన ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 68 చొప్పున.. మొత్తం 1,200 నిర్మిస్తారు.
ఎన్నెన్నో సౌకర్యాలు..
ప్రాజెక్టులో భాగంగా అన్ని టవర్లకు ఉమ్మడిగా టెన్నిస్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు, స్విమ్మింగ్‌పూల్, యాంఫీ థియేటర్, క్లబ్ హౌస్, క్లబ్ హౌస్-2 వంటి వాటితో పాటు ఎన్నో సౌకర్యాలు కూడా ఉన్నాయి. పూర్తి స్తాయి ఎయిర్ కండిషన్డ్ జిమ్, ఏరోబిక్స్ హాల్, యోగా/మెడిటేషన్ రూమ్, స్విమ్మింగ్‌పూల్, స్పా, సెలూన్, మసాజ్ రూమ్, స్టీమ్ రూక్, ట్రీట్మెంట్ రూమ్, బ్యాడ్మింటన్ కోర్టు, స్క్వాష్ కోర్టు, టేబుల్ టెన్నిస్ కోర్టు, బిలియర్డ్స్, చెస్ అండ్ క్యారం బోర్డు, పూల్ టేబుల్, బాస్కెట్ బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, స్కేటింగ్ రింగ్, టెన్నిస్ కోర్టు, ఎయిర్ కండీషన్డ్ మల్టీపర్పస్ హాల్, పార్టీ లాన్, పార్టీ లాంజ్, బిజినెస్ సెంటర్, రీడింగ్ లాంజ్, కేఫ్టీరియా, ప్రివ్యూ థియేటర్, సూపర్ మార్కెట్, క్లినిక్, ఫార్మశీ డెస్క్, ట్రావెల్ డెస్క్, ఏటీఎంలు, ప్రాజెక్ట్ మెయింటినెన్స్ ఆఫీసు, ఆంపీ థియేటర్, మెడిటేషన్ గార్డెన్, ప్యాసింజర్ ఎలివేటర్స్, గూడ్స్ లిఫ్ట్స్, ఫర్నిష్డ్ ఎయిర్ కండిషన్డ్ గెస్ట్ రూమ్స్, ఔట్ డోర్ ఫిట్నెస్ స్టేషన్, జాగింగ్ – రన్నింగ్ ట్రాక్, రిఫెక్సాలజీ పార్క్ వంటివి ఏర్పాటు చేయనున్నారు.
విస్తరణకు పెరుగుతున్న డిమాండ్..
కూటమి సారథిగా చంద్రబాబు మళ్లీ సీఎంగా వచ్చాక హ్యాపీనెస్ట్‌కు తిరిగి పురుడుపోయడం.. టెండర్లు కూడా పిలవడంతో ఇది త్వరలోనే పూర్తవుతుందన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడుతోంది. ఈ ప్రాజెక్టును విస్తరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్ల పరిధుల్లో ఇలాంటి ప్రాజెక్టులు చేపడితే రాజధానిలో తామూ స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటామని అంటున్నారు.