ఒక్క పింఛను.. ఒకే ఒక్క పింఛను.. దివ్యాంగురాలి ఉసురు తీసింది. దాదాపు 18 సంవత్సరాలుగా ఆమెకు అందుతున్న పింఛన్‌ను మంత్రిగా ఉన్న సమయంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు..తొలగించేశారని ఆమె నెత్తీనోరూ మొత్తుకుంది. “అయ్యా నేను బీదరాలను. అమ్మతో కలిసి ఉంటున్నాను.. పెళ్లి చేసుకునేందుకు కూడా అవకాశం లేని విధంగా అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నాను. ఉన్న ఒక్క పింఛను ఆధారాన్ని తొలగించేయకండి సార్!!“-అని ఆ దివ్యాంగురాలు పెట్టుకున్న మొరను మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు పెడచెవిన పెట్టారు.
ఫలితంగా పింఛను రాక.. పూట గడవక.. అమాయక దివ్యాంగురాలు ఉరి వేసుకుని ప్రాణం తీసుకుంది. ఈ ఘటన విజయవాడలోనే జరిగినా.. ఘటన తాలూకు.. వైసీపీ నాయకుడి నిర్దయ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏటా అనేక మంది కొత్తవారికి.. అనర్హులకు కూడా పింఛను పథకంలో అవకాశం ఇస్తున్నారనేది నిర్వివాదాంశం. కానీ.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని భవానీ పురానికి చెందిన శివారు ప్రాంతం ఊర్మిళానగర్‌లో నివసించే ప్రశాంతి కుమారికి అన్యాయం జరిగిందని వైసీపీ నాయకులే అంటున్నారు.
37 ఏళ్ల ఇరువూరి ప్రశాంతి కుమారి పుట్టుకతోనే అంగ వైకల్యంతో జన్మించింది. వీల్ చైర్‌కే పరిమితమైన ఆమె.. యాక్టివ్‌గా ఉంటారు. అయితే.. ఆమెకు 18 ఏళ్లుగా దివ్యాంగ పింఛన్ వస్తోంది. 2019 వరకు నిరవధికంగా వచ్చిన పించను.. ఆ తర్వాత నిలిచిపోయింది. దీనికి కారణం.. ఆమె జనసేనకు మద్దతుగా అప్పటి ఎన్నికల్లో వీల్ చైర్‌పై ప్రచారం చేయడమేననే టాక్ వినిపించింది. ఇదే విషయాన్ని అప్పట్లో మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావుకు.. ఆమె మొర పెట్టుకుంది.
తనకు జగన్ అంటే అభిమానమేనని.. కానీ, పార్టీ పరంగా తాను జనసేనకు మద్దతు ఇచ్చినంత మాత్రాన పింఛను ఎలా తొలిగిస్తారనిఆమె కన్నీరు పెట్టుకుంది. వీల్ చైర్లోనే వచ్చి..మంత్రి ఇంటి ముందు నిరసన కూడా వ్యక్తం చేసింది. అయితే.. ఆమెకు నాలుగు ఇళ్లు ఉన్నాయని అందుకే పింఛను తొలగించామని చెప్పిన మంత్రి.. కనీసం ఆమె నుంచి దరఖాస్తు కూడా స్వీకరించలేదని ఆమె మాతృమూర్తి తెలిపారు.
నిరవధికంగా.. ఈఅంశంపై జిల్లా కలెక్టర్ వరకు పోరాటం చేసినా.. కేవలం రాజకీయ కారణాలతోనే ఆమెకు పింఛను ఆపేశారన్నది కుటుంబం వాదన. మొత్తానికి ఆమె శనివారం ఆత్మహత్య చేసుకుంది. పింఛను దొంగలు.. అంటూ.. ఆమె రాసుకున్న సూసైడ్ నోట్ అందరినీ విస్మయానికి.. విచారానికి గురి చేసింది. మరి ఈ పాపం ఎవరిది? అంటే.. ఆమె కుటుంబ సభ్యుల వేళ్లు వెల్లంపల్లివైపే చూపిస్తున్నాయి.