జగన్ పాలనలో జనం ఓ పక్క కరెంటు కోతలతో..మరో పక్క కరెంటు బిల్లుల మోతతో నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఆఖరికి ప్రభుత్వ ఆసుపత్రులలో వెంటిలేటర్లకు కరెంటు కోతల కష్టాలు తప్పకపోవడంతో ముగ్గురు పసికందులు మృత్యువాత పడిన ఘటన కలకలం రేపుతోంది. ఇక, కరెంటు లేదంటూ చేతులెత్తేసిన జగన్ సర్కార్…శని, ఆది వారాలలో పవర్ హాలిడే ప్రకటించడంపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని వివాహా వేడుకలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది . కరెంటు కోతల నడుమ ఓ జంట పెళ్లి చేసుకోవడంతో….వధూవరులకు గిఫ్ట్ గా మిత్రులు విసన కర్రలు ఇచ్చిన వైనం హాట్ టాపిక్ గా మారింది. కొత్త కాపురంలోకి అడుగుపెట్టబోతోన్న నూతన వధూవరులకు పవర్ కట్ ను పదే పదే గుర్తుకుతెచ్చేలా ఈ విసనకర్రలు గిఫ్ట్ గా ఇచ్చి ఆటపట్టించారు మిత్రులు.
ఇక, తమిళనాడులోని మరో పెళ్లిలో వధూవరులకు ఇంకో వెరైటీ గిఫ్ట్ వచ్చింది. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతున్న నేపథ్యంలో కొత్త దంపతులకు పెట్రోల్, డీజిల్ బాటిళ్లను మిత్రులు గిఫ్ట్ గా ఇచ్చిన వైనం కూడా వైరల్ అయింది. అయితే, ఈ తరహా సెటైరికల్ గిఫ్ట్ లు ఇవ్వడం ఇది తొలిసారి కాదు. ఉల్లి పాయల ధరలు మండిపోతున్న సమయంలో పెళ్లి చేసుకున్న దంపతులకు ఉల్లిగడ్డలు ప్యాక్ చేసి గిఫ్ట్ గా ఇచ్చిన ఘటనలు కూడా వైరల్ అయ్యాయి. ఏది ఏమైనా…ఆ వధూవరులకు ఇచ్చిన గిఫ్ట్ ఏపీలోని విద్యుత్ కోతల దుస్థితికి అద్దంపట్టే సెటైర్ లా ఉందని నెటిజన్లు అంటున్నారు.