జగన్ అంటే ఆ పార్టీలో తమిళనాడు స్టైల్ లాగా అందరికీ భయమే. నేతకు ఎదురుతిరగడం కష్టం అనుకునేవారు. మొదటి ఏడాది జగన్ నంది అంటే నంది, హంస అంటే హంసే. కానీ రఘురామరాజు మొదలుపెట్టిన రెబలిజం పార్టీలో బాగా పాకుతోంది. అంజిరెడ్డి అనే పెద్దాయన ఎలక్షన్ లో తొడగొట్టడం వైరల్ అయ్యింది. ఇలాంటి చాలామంది సామాన్యులు ఎదురుతిరిగారు. ఇసుక, మందు జనాల్లో కోపం కట్టలు తెంచుకునేలా చేసింది. ఇక నిమ్మగడ్డ జగన్ ని ఓడించడం తో జగన్ రెడ్డికి కూడా ఎదురుతిరగొచ్చు అని అందరికీ అర్థమైపోయింది. ఇక రఘురామరాజు వ్యవహారంతో జగన్ ఏం తోపు కాదు… టీవీ ముందు కూర్చుని కూడా ఆడేసుకోవచ్చు అని అందరికీ అర్థమైంది.
బయట ఇలా అనుకుంటే పర్లేదు. కానీ ఆయన ఉంటున్న గుంటూరు జిల్లాలోని రాజకీయాలు, పక్కనున్న కృష్ణా జిల్లా జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారాయట. నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు, చిలకలూరిపేట ఎంఎల్ఏ విడదల రజని మధ్య విభేదాలు పెరిగిపోయాయి. కాలం గడిచేకొద్దీ వీళ్ళ మధ్య వివాదాలు కూడా పెరుగుతున్నాయి. వీళ్ళ వివాద పరిష్కారానికి కొంత ప్రయత్నం జరిగినా కుదరలేదు. దాంతో ఒకళ్ళపై మరొకళ్ళు నిఘా పెట్టుకునేంత స్ధాయికి గొడవలు పెరిగిపోయాయి. జగన్ పంచాయతీ చేసినా వారు మాట వినడం లేదు.
విషయం ఏమిటంటే ఇద్దరూ రాజకీయాలకు కొత్తే. ఇద్దరూ పోటి చేసింది మొదటిసారే. పోటి చేసిన మొదటి ఎన్నికల్లోనే గెలవటంతో వీళ్ళని పట్టేవాళ్ళే లేకుండాపోయింది. వీళ్ళద్దరిలో లావు ఎన్నికలకు ముందే వైసీపీలో చేరి పనిచేస్తే రజని మాత్రం ఎన్నికలకు ముందు మాత్రమే వైసీపీలో చేరి చివరి నిముషంలో టికెట్ తెచ్చుకుని గెలిచారు. ఎప్పుడైతే చిలకలూరిపేటలో గెలిచిందో అప్పటి నుండే అందరిపైనా రజని ఆధిపత్యం చెలాయించటం మొదలుపెట్టింది. తన నియోజకవర్గంలోకి తన అనుమతి లేకుండా ఎంపి పర్యటించకూడదంటూ ఆంక్షలు మొదలుపెట్టింది.
చిలకలూరిపేట రజని నియోజకవర్గమైతే నరసరావుపేట పార్లమెంటు నియోజకరవర్గం తనది కాబట్టి ఎక్కడైనా తిరిగే స్వేచ్చ తనకుందంటూ లావు రివర్సు మొదలుపెట్టారు. తన పర్యటనకు రజని అనుమతి అవసరం లేదన్న లావు రాజకీయంతో ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోయాయి. చివరకు తన సొంత పనిమీద ఎంపి చిలకలూరిపేటకు వచ్చినా ఎంఎల్ఏ వర్గీయులు అనుమతించటం లేదు. పార్టీ నేత ఒకరికి అనారోగ్యంగా ఉందని చూడటానికి చిలకలూరిపేటకు వచ్చిన ఎంపి కారుపై ఎంఎల్ఏ వర్గీయులు దాడి చేయటం అప్పట్లో సంచలనమైంది.
అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎంపి వస్తున్నారంటే ఎంఎల్ఏకి ముందుగా సమాచారం ఇవ్వటం ఓకేనే. కానీ వ్యక్తిగత కారణాలతో కూడా తన నియోజకవర్గంలోకి వచ్చేముందు సమాచారం ఇవ్వాలని రజని మద్దతుదారులు పట్టుబడుతుండటమే విచిత్రంగా ఉంది. పార్టీ పరంగా వీళ్ళ మధ్య వివాదాన్ని సర్దుబాటు చేసేందుకు చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదని సమాచారం. ఈ గొడవలు ఇలాగుండగానే రజనితో పాటు ఆమె పీఏ ఫోన్లను ట్యాపింగ్ చేయించారనే విషయంలో ఆరోపణలు మొదలయ్యాయి.
ఈ విషయం ఎంఎల్ఏకి తెలియటంతో వెంటనే ఆమె ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న నేతల ముందు పంచాయితి పెట్టిందట. దాంతో విషయంపై ఆరాతీసిన తర్వాత ఇద్దరు పోలీసు అధికారులను రాత్రికి రాత్రే బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే వీళ్ళద్దరి మధ్య వివాదాలు పరిష్కరించలేని దశకు చేరుకున్నట్లే అనుమానంగా ఉంది. అంటే వీళ్ళ సమస్యకు క్లైమ్యాక్సుగా జగన్ సమక్షంలో పంచాయితీ జరగటమే మిగిలుంది. జగన్ చెప్పినా కూడా సర్దుబాటు కాకపోతే ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇబ్బందులు తప్పవన్న విషయం తేలిపోయింది. అంటే సమయం చూసి ఎంపి మీదో లేకపోతే ఎంఎల్ఏ మీదో వేటు తప్పదనే విషయం పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఏమి జరుగుతుందో చూడాలి.