మహమ్మద్ ప్రవక్తపై తీవ్ర వ్యాఖ్యలు చేసి.. తీవ్రస్థాయిలో రచ్చ రేపిన నూపుర్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరంలేదు. బీజేపీ పార్టీలో ఉన్న ఆమెను సదరు వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో పార్టీ నుంచి పక్కన పెట్టారు. అయితే.. తాజాగా ఆమెకు పోలీసులు గన్ ఇచ్చారు. తనకు ప్రాణ భయం ఉందని.. గన్ కొనుక్కుంటానని.. లైసెన్స్ ఇవ్వాలని ఆమె కోరడంతో .. పోలీసులు అడిగిందే తడవుగా ఆమెకు గన్ లైసెన్స్ మంజూరు చేశారు.
అసలు ఏం జరిగింది?
యూపీలోని జ్ఞానవాపి మసీదు, అక్కడే శివాలయం వంటి విషయాలు వెలుగు చూసిన తర్వాత.. ఈ కేసు విచారణ సాగింది. ఈ సమయంలో నూపుర్ శర్మ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవక్తపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు దేశంలోను.. ప్రపంచ ముస్లిం దేశాల్లోనూ తీవ్ర విమర్శలకు గురయ్యాయి. దుబాయ్ తదితర మిత్ర దేశాలు సైతం.. భారత్‌ను ప్రశ్నించాయి. ఇంత రచ్చజరిగిన తర్వాత.. ఆమెను పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది.
ఇక, ఆ తర్వాత.. కళ్లు తెరుచుకున్న శర్మ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ.. సుప్రీంకోర్టు ఆమెపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేశాన్ని తగులబెట్టారని దుయ్యబట్టింది. దేశంలో జరుగుతున్నదానికి ఆమె మాత్రమే బాధ్యురాలని స్పష్టం చేసింది. కానీ ఆమెపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులన్నిటినీ ఢిల్లీలోనే విచారణ జరిగేలా గత ఏడాది ఆగస్టులో ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఆమెను హత్య చేస్తామంటూ పలువురు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో తనకు వ్యక్తిగత తుపాకీ లైసెన్స్ మంజూరు చేయాలని నూపుర్ శర్మ ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేశారు. దీంతో పోలీసులు ఆమె తన వెంట తుపాకీని తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.