గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇక్కడి ఒక గ్రామం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ గ్రామమే రాజ్కోట్ జిల్లాలో రాజ్ సమధియాలా. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, మరోపార్టీ ఆమ్ ఆద్మీ పార్టీలు ఇక్కడ ఊరూ వాడా తేడాలేకుండా.. ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. డిసెంబరు 1న జరగనున్న తొలిదశ, డిసెంబరు 5న మలిదశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల నాయకులు పట్టణాలు, గ్రామాల్లోని ప్రతి ఇంటినీ జల్లెడపట్టి మరీ తమకు ఓటేయ మంటే తమకే ఓటేయమని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
అయితే, ఇంత జోరు ప్రచారంలోనూ రాజ్కోట్ జిల్లాలో ఉన్న రాజ్సమధియాలా గ్రామం జోలికి మాత్రం ఏ ఒక్క పార్టీకానీ, ఏ ఒక్క నాయకుడు కానీ వెళ్లడం లేదు. వినేందుకు ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. ఆ గ్రామంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంపై ఇక్కడి గ్రామస్తులు, పంచాయతీ పెద్దలు నిషేధం విధించడమే దీనికి కారణం. కనీసం రాజకీయ పార్టీల కరపత్రాన్ని కూడా గ్రామంలోకి రానివ్వరు. మరి ఆయా పార్టీలకు ప్రచారం ఎలా జరుగుతుందని అనుకుంటున్నారా?
ఇక్కడ గ్రామ పెద్దలు.. ఏయే పార్టీల తరఫున ఎవరు పోటీ చేస్తున్నారో.. ఉదయం, సాయంత్రం వేళ్లలో రెండుసార్లు మాత్రమే ఇక్కడి ప్రజలకు మైకుల ద్వారా తెలియజేస్తారు. అంతేతప్ప.. వీరికి ఓటేయాలని కానీ, వారికి వేయొద్దని కానీ వారు చెప్పరు. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటేసుకునే అవకాశం కల్పిస్తారు. ప్రచారహోరు.. తాయిలాల జోరు మాటకు కూడా ఇక్కడ వినిపించదు.
రాజ్కోట్ జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్సమాధియాలా గ్రామంలోకి రాజకీయ పార్టీలకు ప్రవేశం లేదు. రాజకీయ నేతల ఊకదంపుడు ప్రచారార్భాటాలకు దూరంగా ఉన్న ఈ గ్రామం… ప్రజాస్వామ్యంలో అతి పదునైన ఆయుధం ఓటు వినియోగంపై మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఊరిలో ఎవరైనా ఓటు వేయకుంటే వారికి 51 రూపాయల జరిమానా విధిస్తారు. దీని ప్రభావంతో కొన్నాళ్లుగా ఇక్కడ వంద శాతానికి దగ్గరగా ఓటింగ్ నమోదవుతోంది.
రాజ్ సమధియాలా గ్రామ సర్పంచ్ని కూడా ప్రజలంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1700 మంది ప్రజలు ఉన్న ఈ ఊరిలో గ్రామాభివృద్ధి కమిటీ ఉంటుంది. రాజకీయ పార్టీల ప్రచారాన్ని ఊరిలోకి అనుమతించకూడదని 1983లోనే ఈ గ్రామం ఒక నియమం పెట్టుకుంది. ఊరిలోకి వెళ్తే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని రాజకీయ నేతలు కూడా ఈ కట్టుబాటును గౌరవిస్తున్నారు. ఎవరైనా ఓటు వేయకుంటే వారికి రూ.51 జరిమానా విధిస్తున్నారు. ఏదైనా కారణంతో ఓటు వేయలేని పరిస్థితి ఉంటే ముందుగా అనుమతి తీసుకోవాలి అనే నిబంధనను ఖచ్చితంగా పాటిస్తుండడం మరో విశేషం.