కొద్ది రోజుల క్రితం కన్నడ రాజకీయాల్లో నాటకీయ పరిణామాల మధ్య సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 75 ఏళ్లు దాటిన వ్యక్తులు అత్యంత కీలకమైన పదవుల్లో ఉండకూడదన్న పార్టీ నియమావళికి కట్టుబడి యడ్డీ రాజీనామా చేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే, యడ్డీ రాజీనామా వెనుక అసలు కారణం వేరే ఉందని, యడ్డీపై బీజేపీ పెద్దల అసంతృప్తే యడ్డీ పదవికి ఎసరుపెట్టిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రధాని మోడీ సొంత ఇలాకా గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా చేయడం సంచలనం రేపింది. ఈ రోజు ఉదయం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు రూపానీ ప్రకటించారు. అనంతరం, తన రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించారు. రూపానీ రాజీనామాతో గుజరాత్ రాజకీయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశముందని తెలుస్తోంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ రూపానీ అదే కారణంతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
కొద్ది రోజుల క్రితం ఓ సభలో హఠాత్తుగా విజయ్ రూపానీ కుప్పకూలారు. దీంతో, తనకు విశ్రాంతి అవసరమని రూపానీ రాజీనామా చేసినట్లు గుజరాత్ బీజేపీ పెద్దలు చెబుతున్నారు. కానీ, విజయ్ రూపానీని తప్పించారని, త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికలకు కొత్త సీఎం అభ్యర్థితో వెళ్లాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందని, అందుకే రూపానీని సైడ్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇక, యడియూరప్ప, రూపానీ తరహాలోనే మరి కొందరు బీజేపీ కీలక నేతలపై కూడా వేటు పడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.