గుజరాత్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఆదివారం రోజున.. ఆహ్లాదం కోసం తీగల వంతెన మీదకు రావటం శాఫమైంది. ఉత్సాహంతో సెలవు రోజును ఎంజాయ్ చేస్తున్న వేళ.. అనూహ్యంగా తీగల వంతెన కుప్పకూలిపోవటంతో.. పెద్ద ఎత్తున సందర్శకులు నదిలో పడిపోవటం.. నది లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పలువురు మునిగిపోయినట్లు చెబుతున్నారు.
షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. ఈ తీగల వంతెన బ్రిటిష్ కాలం నాటిది కావటం గమనార్హం. ఆదివారం అర్థరాత్రి ఒంటి గంట వరకు అందిన సమాచారం ప్రకారం 78 మంది జలసమాధి అయినట్లుగా చెబుతున్నారు. గల్లంతైన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండటంతో.. మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. దీనికి భారీ ఎత్తున మరమ్మత్తులు చేసి.. కొత్త సంవత్సరం నేపథ్యంలో నాలుగు రోజుల క్రితమే దీన్ని తిరిగి ప్రారంభించారు. సందర్భకుల్ని దీనిపైకి అనుమతిస్తున్నారు. సందర్శకుల్ని అనుమతించిన నాలుగు రోజులకే ఇలాంటి ఘోరాన్ని చూడాల్సి రావటంపై ఆవేదన వ్యక్తమవుతోంది.
ఇంతకూ ఈ ఘోరం ఎలా జరిగింది? దీనికి కారణం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని మోర్బీ నగరంలోని మచ్చు నదిపై బ్రిటిష్ పాలన కాలంలో ఒక తీగల వంతెనను నిర్మించారు. ఇది ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో కూలింది. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము .. ప్రధాని నరేంద్ర మోడీ మొదలు పలువురు ముఖ్యనేతలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
మోర్బీ నగరంలో మచ్చు నదిపై నిర్మించిన ఈ తీగల వంతెన ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. దాదాపు ఏడు నెలల పాటు దానికి రిపేర్లు చేపట్టి.. నాలుగు రోజుల క్రితమే మళ్లీ వాడుకునేందుకు వీలుగా పర్యాటకుల్ని అనుమతిస్తున్నారు.
దీపావళి సెలువులు రావటం.. ఆదివారం కావటంతో వంతెనపై రద్దీ చోటు చేసుకుంది. సాయంత్రం వేళలో వందల మంది వంతెన పైకి చేరారు. అక్కడి నుంచి నదీ అందాల్ని చూస్తూ పరవశించిపోతున్నారు.
కొంతమంది అటు ఇటూ పరుగులు తీస్తూ ఆడుకుంటున్నారు. ఇలాంటి వేళలో.. పెద్ద శబ్దం వచ్చి ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో.. వంతెన మీద నుంచి పెద్ద ఎత్తున నదిలో పడిపోయారు. లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోని వారు మునిగిపోతే.. ఛాతీ వరకు మాత్రమే లోతు ఉన్న వారు మాత్రం భయంతో హాహాకారాలు చేశారు. సాయం కోసం అర్థించారు.
వంతెన మీద అధిక బరువు కారణంగానే కూలినట్లుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు లెక్క తేలిన దాని ప్రకారం మరణించిన వారి సంఖ్య 78 వరకు ఉన్నా.. మరింత పెరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది. వంతెన కూలిన సమయంలో దాని మీద 400 – 500 మధ్య వరకు ఉన్నట్లుగా చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సేష్టీ డిపార్టుమెంట్ తో పాటు.. పోలీసులు.. ఇతర సిబ్బంది.. కొందరు స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతు అయిన వారి కోసం పడవలతో వెతకటం షురూ చేశారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ.. మరణించిన వారికి కేంద్రం తరఫున రూ.2 లక్షలు వారి కుటుంబ సభ్యులకు.. గాయపడ్డ వారికి రూ.50వేలు చొప్పున పరిహారం అందించారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వారికి రూ.4 లక్షల చొప్పున.. గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. దీని కంటే ముందు.. నాణ్యత ప్రమాణాల్ని పాటించకుండాఅనుమతులు ఇచ్చిన అధికారుల మీద చర్యలు కూడా తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
https://www.youtube.com/watch?v=jCBluONftC0&ab_channel=NDTV