ఏపీ వైసీపీలో నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ ఎవరికి వారు..దూకుడు ప్రదర్శిస్తు న్నారు. అంతేకాదు, గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఇప్పుడు వివాదాలు, విభేదాలు రోడ్డెక్కుతున్నాయి. కీలక నేతలను కూడా పార్టీలో ఎవరూ లెక్క చేయడం లేదు.
ఇటీవల పార్టీ ప్రధాన నాయకుడు, ఎంపీ విజయసాయి రెడ్డిపై ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విరుచుకుపడడం.. ఇది జరిగి రెండు రోజులు కూడా కాకముందుగానే తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు.. ఏకంగా మంత్రి కన్నబాబు, పినిపే విశ్వరూప్లను టార్గెట్ చేయడం పార్టీలో సంచలనం సృష్టించింది.
ఇక, నెల్లూరులో మంత్రులపైనే ఓ ఎమ్మెల్యే పైచేయి సాధించేలా వ్యవహరించడం, అవినీతి ఆరోపణలు పెల్లుబుకడంపై ప్రధాన మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక, గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే దూకు డు మామూలుగా లేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో కలిసి మెలిసి ముందుకు సాగాలని సీఎం జగన్ చెబుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. జగనే నేరుగా సయోధ్య చేయాలని చూసినా.. ఎక్కడా ఫలితం దక్కడం లేదు. ఒక్క గన్నవరం నియోజకవర్గంలోనే కాదు.. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలోనూ తోట త్రిమూర్తులుకు, మంత్రి చెల్లుబోయిన వేణుకు మధ్య ఇప్పటి కీ పరిస్థితి భగ్గుమంటూనే ఉంది.
ఇక, అదే జిల్లా రాజోలు నియోజకవర్గంలోనూ వైసీపీ నేతలు గ్రూపులుగా ఎర్పడడం వీటిని మంత్రులు ఓన్ చేసుకుని మరీ ప్రోత్సహించడం.. జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్.. అన్నీతానై అధికార పార్టీ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవడం వంటివి సంచలనంగా మారాయి.
మరోవైపు.. అధికార పార్టీ నేతలతో పోలీసులు కుమ్మక్కవుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఒక్కసారిగా ఇలా పరిస్థితి అదుపుతప్పడా నికి కారణాలేంటి? ఎందుకు జరుగుతోంది? అని ఆరాతీస్తే.. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని.. అంటున్నారు పరిశీలకులు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో నేతలను తీవ్రంగా కలవరపరుస్తున్నాయని చెబుతున్నారు.
ప్రభుత్వ పరంగా ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు.. ప్రజల్లోనే నవ్వుల పాలవుతున్నాయి. ఇక, కేంద్రంపై పోరాడే శక్తి లేదని తొలి ఏడాదిలోనే నిరూపించుకున్న నాయకుడిగా.. చరిత్రకెక్కే ఛాన్స్ కూడా సమీప భవిష్యత్తులోనే కనిపిస్తోంది.
వీటన్నింటికీ తోడు.. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడం, మరోవైపు.. అవసరం లేకున్నా.. ఇతర పార్టీల నుంచి నేతలను పార్టీలోకి తీసుకోవడం వంటివి నేతల్లో జగన్ అంటే.. ఏవగింపునకు, చులకనకు కూడా కారణమవుతోందని అంటున్నారు పరిశీలకులు.
ఈ క్రమంలోనే ఎవరికివారు ఎక్కడికక్కడ.. `దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం`అనే ధోరణిలో వ్యవహరిస్తున్నార ని అంటున్నారు. ఇది పార్టీని పతనావస్థ దిశగా నడిపిస్తోందని చెబుతున్నారు.