ఏపీ సీఎం జగన్‌పై సెటైర్లు పేలుతున్నాయి. `శిలలపై శిల్పాలు చెక్కినారూ..` అంటూ.. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో వచ్చిన పాటను.. ప్యారెడీగా మార్చి “శిలలపై జగనన్న ఎక్కినారూ..“ అని సొంత పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో ట్రెండింగా మారిందని అంటున్నారు. మొత్తానికి ఏం జరిగిందని ఆరాతీస్తే.. సీఎం జగన్‌కు ప్రచార యావ ఎక్కువైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి దానికీ ఆయన ప్రచారాన్ని కోరుకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వం తరఫున ప్రజలకు చేసే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రచారం చేసుకోవచ్చు.
కానీ, ప్రజలకు పంచే నిత్యావసరాలకు వినియోగించే సంచులపైనా ఆయన బొమ్మలే. ఆయన పేరుతోనే బోలెడన్ని పథకాలు. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న వాహన మిత్రం.. ఇలా అనేక పథకాలు జగన్ పేరు, ఫేసులతోనే ఉన్నాయి. అంతేకాదు, ప్రతి కార్యాలయంలోనూ ఆయన ఫొటో ఉండాల్సిందే. ఇలా ప్రచారానికి ప్రాముఖ్యం ఇచ్చే సీఎం పక్కన పనిచేసే వారు కూడా అంతే రేంజ్లో ఆయన మనసును తృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తారు.
కొన్నాళ్ల కిందట పేదలకు ఇళ్ల పథకం కింద నిర్మించిన ఇళ్లలో టైల్స్‌పై జగన్ బొమ్మ వేయించారు. నిజానికి టైల్స్‌ను కాలికింద వేసి తొక్కుతారు. ఆ విషయం అతి చేయాలనుకునే ఆలోచనలో గుర్తించ లేక పోయిన సదరు అధికారి.. ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకున్నారు. ఫలితంగా ఓ ఐదు లక్షల వరకు చేతి చమురు వదిలిందని సంబంధిత శాఖలో ప్రచారం సాగింది.
ఇక, ఇప్పుడు సమగ్ర భూ సర్వే లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే రాళ్లను పాతాలని సర్కారు నిర్ణయించింది. అందరూ ఏదో ఒక విధంగా ఆకర్షిస్తున్నారని అనుకున్న సర్వే శాఖ అధికారి.. సర్వే కోసం సరిహద్దుల వెంబడి పాతే రాళ్లను చీమకుర్తి నుంచి తెప్పించారు.
అంతేకాదు, వీటిపై ఒకవైపు జగన్ చిత్తరువును చెక్కించారు. మరో వైపు.. ప్రభుత్వం ఎంబ్లమ్‌ను చెక్కించారు. దీంతో సీఎం ఖుషీ అవుతారని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఈ విషయంలో వెనక్కి తగ్గారు.
మొత్తానికి జగన్‌కు ఉన్న ప్రచార యావ.. అధికారులకు కూడా అర్ధమై.. వారి కి ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. దీంతో ప్రజల సొమ్ము.. రాళ్ల పాలవుతోందనే కామెంట్లు కూడా వస్తున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తున్న సోషల్ మీడియా జనాలు.. సెటైర్లు పేలుస్తున్నారు.