రుణాలు ఇవ్వడం లేదనిబ్యాంకులపై ఆగ్రహం
వాటి ముందు చెత్తపోయించిన అధికారులు
సీఎం పేషీ అధికారి ఆదేశాలతోనే!
కేంద్రం సీరియస్ కావడంతోనాలుక్కరుచుకున్న అధికారులు
జగన్ పరిపాలనాశైలికి ఇదే నిదర్శనం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం, సుహృద్భావ వాతావరణం ఉందా.. లేదా అన్న సందేహాలు ముసురుకుంటున్నాయి. జగన్ ప్రభుత్వం గత 19 నెలలుగా ప్రతిపక్ష టీడీపీ నేతలే లక్ష్యంగా చెలరేగిపోతోంది. అక్రమ కేసులు, అరెస్టులు, జైళ్లు, గృహనిర్బంధాలు, ఇళ్ల కూల్చివేతలు.. నిత్యకృత్యంగా మారాయి. ఇప్పుడు ఈ దమనకాండను కేంద్ర ప్రభుత్వ అధీనంలోని బ్యాంకులపైనా అమలు చేయాలని చూస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు , వైసీపీ నేతలకు రుణాలివ్వడం లేదన్న కోపంతోనే ఇలాంటి పనులు చేస్తోంది. వైసీపీ జిల్లా స్థాయి బ్యాంకర్లను కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను బెదిరిస్తున్నారు. అంతటితో ఆగకుండా.. బ్యాంకుల కార్యాలయాల ముందు పారిశుద్ధ్య సిబ్బందితో చెత్త వేయిస్తున్నారు. సీఎం పేషీలోని కీలక అధికారి ఆదేశాలతోనే అధికారులు చెలరేగిపోతున్నారని తెలియవచ్చింది. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సోమందేపల్లిలో బ్యాంకుకు వచ్చారు. ‘జగనన్న తోడు’ పథకంపై సమీక్ష నిర్వహించారు. ‘లోన్ల సంగతేమిటి’ అని ఆరా తీశారు. దీంతో బ్యాంకు అధికారులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ‘బ్యాంకులకు తాగునీళ్లు, కరెంటు కట్ చేస్తే… వాళ్లే దారికి వస్తారు. లక్ష్యాల మేరకు రుణాలు ఇస్తారు’ అని ఓ మున్సిపల్ కమిషనర్‌కు జిల్లా జాయింట్ కలెక్టర్ అనధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఒక సమీక్షలో సెర్ప్ ఉద్యోగులు బ్యాంకు ఉన్నతాధికారులను నిలదీశారు. ‘మేం చెప్పినట్లు వినాల్సిందే’ అన్నట్లుగా వ్యవహరించారు. దీనిని జీర్ణించుకోలేని బ్యాంకు అధికారులు… సమావేశం రద్దు చేసుకుని బయటకు వెళ్లిపోయారు. జగనన్న తోడు, చేయూత పథకాల అమలులో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామని… ఆచరణ సాధ్యంకాని నిబంధనలతో ఇబ్బంది పెడుతున్నారని అమరావతి సర్కిల్ పరిధిలోని ఎస్బీఐ అధికారుల సంఘం బ్యాంకు ఉన్నతాధికారులకు లేఖ రాసింది.
ఈ పరిస్థితుల్లో కృష్ణా జిల్లా ఉయ్యూరు, విజయవాడ, మచిలీపట్నం, గొల్లపూడి తదితర ప్రదేశాల్లోని వివిధ జాతీయ బ్యాంకుల ఎదుట చెత్తను కుమ్మరించడం, చెత్తను తరలించే ట్రాక్టర్లను ద్వారాలకు అడ్డుగా పెట్టడం వంటివి చోటు చేసుకున్నాయి! కనీవినీ ఎరుగని ఈ సంఘటనను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు బ్యాంకుల యాజమాన్యాలు చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నాయి. పైగా.. ఈ అమానుష కృత్యం రుణాలందని అసలైన లబ్ధిదారులు చేసినది కాకపోగా.. కృష్ణా జిల్లా కలెక్టర్ ఎం.డి. ఇంతియాజ్ ఆదేశానుసారమే జరిగిందన్న పక్కా సమాచారం కేంద్ర ప్రభుత్వాన్ని నివ్వెరపరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు కీలక ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారం మొత్తానికి ఇంతియాజ్ మౌఖిక ఆదేశాలే కారణమని, ఆయన హుకుం మేరకే ఆయా నగరాలు, పట్టణాల్లోని పురపాలక శాఖ అధికారులు బ్యాంకుల ముందు చెత్తను కుమ్మరింపజేశారని అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు! సర్కారు విచారణ కమిటీ వేసి.. ఉయ్యూరు కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ఇద్దరు కమిషనర్లను వివరణ కోరి చేతులు దులుపుకొంది. కానీ ఈ చెత్తపనికి ఆదేశించిన కలెక్టర్ ఇంతియాజ్ జోలికి మాత్రం వెళ్లలేదు.
చెప్పిందే చేశారు..!
బ్యాంకర్లపై శివాలు, ప్రేలాపనలు.. ఇంతియాజ్‌కు మామూలే..! పథకాల అమలుకు సంబంధించి నిర్వహించే సమీక్షా సమావేశాల్లో ఆయన తరచుగా బ్యాంకర్లకు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఈమధ్య కాలంలో మరింత ‘దూకుడు’ను ప్రదర్శిస్తున్న ఈయన ‘చెత్త ఘటన’ జరిగిన ముందు రోజున అంటే విజయవాడలో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ‘విశ్వరూపం’ చూపారు! తాను ఆదేశించినట్లుగా బ్యాంకులు రుణాలివ్వకుంటే వాటి ముందు ఎక్కడికక్కడ చెత్తను కుమ్మరింపజేస్తామని, కరెంట్, వాటర్ కట్ చేయిస్తానని ప్రకటించారు. బ్యాంకులకు తాళాలు వేయించేస్తానని కూడా బెదిరించారు. నిజంగానే అన్నంత పనీ చేయించారు.
గ్యారెంటీ లేకుండా రుణాలెలా?
ప్రభుత్వం రకరకాల పథకాలు ప్రవేశపెట్టుకోవచ్చు. ప్రజల చేత జేజేలు కొట్టించుకోవచ్చు. కానీ… బ్యాంకులు మాత్రం ప్రభుత్వ కౌంటర్ గ్యారెంటీలు, ఆర్బీఐ నిబంధనల ప్రకారమే రుణాలు మంజూరు చేస్తాయి. జగన్ ప్రభుత్వం మాత్రం తాము చెప్పినట్లు రుణాలివ్వాల్సిందేనని ఒత్తిడి తెస్తోంది. ‘మీ నిబంధనలతో మాకు పని లేదు. మేం ఎంపిక చేసిన లబ్ధిదారులకు, మా లక్ష్యాల మేరకు రుణాలు ఇవ్వాల్సిందే’ అని కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పట్టుబడుతున్నారు. కొన్నిచోట్ల బ్యాంకర్లు, అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. శక్తికి మించిన ఈ పనుల చేయలేకపోతున్నామంటూ బ్యాంకుల యూనియన్లు ఉన్నతాధికారులకు లేఖలు రాస్తున్నాయి. వైఎస్ఆర్ బీమా, జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయూత పథకాల ద్వారా లబ్ధికలిగించే బాధ్యతను బ్యాంకులకే అప్పగించారు. గతంలో బీమాకు బ్యాంకులతో సంబంధం ఉండేది కాదు. ఇప్పుడు… పథకం దరఖాస్తులు బ్యాంకుల ద్వారా నమోదు చేయించాలనే నిబంధనపెట్టారు. ఇది ఆచరణలో కష్టసాధ్యంగా మారుతోంది. పథకాన్ని ప్రారంభించి 2నెలలు అవుతున్నా ఇప్పటి వరకూ 50శాతం మంది లబ్ధిదారులు కూడా నమోదు కాలేదు. అరకొర సమాచారంతో వచ్చిన దరఖాస్తులను అప్లోడ్ చేసే పరిస్థితి లేక బ్యాంకుల్లో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఆ బాధ్యత మీదేనంటూ ప్రభుత్వ అధికారులు విరుచుకుపడుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకర్లు ఈ ప్రక్రియ చేపట్టలేమంటూ చేతులెత్తేస్తున్నారు.
కొన్నిచోట్ల వైఎస్ఆర్ బీమా ఎనరోల్‌మెంట్ పెంచేందుకు, ముఖ్యంగా జగనన్న తోడు పథకాన్ని సంతృప్తి స్థాయిలోకి తీసుకెళ్లేందుకు మండలస్థాయి, మున్సిపల్ అధికారులపై జాయింట్ కలెక్టర్లు ఒత్తిడి పెంచారు. జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయూత పథకాలను బ్యాంకుల ద్వారా అమలు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వికటించే ప్రమాదముందని బ్యాంకర్లు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా ఎస్ఎల్బీసీలో నిర్ణయం తీసుకుంటున్నారని.. వాటిని బ్యాంకర్లు పాటించాల్సిన అవసరం లేదంటున్నారు. ప్రభుత్వం ఏ నిబంధనలు రూపొందించినా, బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలు మాత్రమే అమలు చేస్తాయని, వాటికి విరుద్ధంగా పనిచేసేది లేదని చెబుతున్నారు. ‘‘బ్యాంకుల రుణ నిబంధనల ప్రకారం రూ.50 వేలకు మించిన రుణాలకు పూచీకత్తు తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేయూత పథకంలో యూనిట్ రూ.75 వేలకు గాను రూ.18,750 లబ్ధిదారుల వాటా పోను రూ.56,250 రుణం ఇవ్వాలని ప్రాజెక్టు తయారు చేశారు.
కానీ.. ఎవరు ష్యూరిటీ ఇస్తారో తెలియదు. దీంతో చేయూత పథకం కింద రుణాల మంజూరు నత్తనడకన సాగుతోంది’’ అని ఒక అధికారి తెలిపారు. ‘జగనన్న తోడు’లో కూడా పలుచోట్ల అసలైన లబ్ధిదారులకంటే బినామీలే ఎక్కువ కనిపిస్తుండటంతో.. వారికి రుణం ఇవ్వడమెలా, ఇచ్చినా తిరిగి వసూలు చేసుకోవడమెలాగో తెలియక బ్యాంకర్లు తలలు పట్టుకుంటున్నారు. పశుకాంత్రి లాంటి పథకాల అమలు మరింత కష్టంగా మారిందని చెబుతున్నారు. స్థానికంగా ఉన్న గేదెలు కొనుగోలు చేయడం, ప్రస్తుతం ఒక్క గేదె మాత్రమే ఇచ్చి, ఆర్నెల్ల తర్వాత మరొకటి ఇవ్వడం వల్ల బ్యాంకులకు రీపేమెంట్ చేయడంలో అవాంతరాలు ఏర్పడతాయని అనుమానిస్తున్నారు. రుణాలకు సంబంధించి యూనిట్ల డిజైన్ల రూపకల్పనలోనే లోపముందని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం అప్పులమయం చేయడంతోనే బ్యాంకర్లు లోన్లు ఇచ్చేందుకు భయపడుతున్నారని రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో పరిపాలన ఎంత ఆటవికంగా సాగుతోందో చెప్పడానికి ఈ ‘చెత్త’ ఉదాహరణ చాలని అంటున్నాయి.