ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా అది వివాదాస్పదం కాకుండా ఉండదు. ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశాలే అందుకు కారణం. తాజాగా ఏపీ సర్కారు ఓ నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా, సులువుగా అందడం కోసమని తమ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లకు ఇకపై వేతనంతో పాటు నెలకు రూ.200 చొప్పున చెల్లించాలన్నదే ఈ తాజా నిర్ణయం.
ఈ 200 రూపాయలు పేపర్ బిల్ కోసమట. సంక్షేమ పథకాలు, సమకాలీన అంశాల గురించి మరింతగా తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం మీద జరిగే దుష్ప్రచారాలను తిప్పి కొట్టి ప్రజల్లో ఆందోళన తొలగించవచ్చని ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ నెల నుంచే ఈ సదుపాయాన్ని కల్పించనున్నారు.
రాష్ట్రంలో 2.66 లక్షల మంది వాలంటీర్లు ఉండగా.. ఒక్కొక్కరికి రూ.200 చొప్పున చెల్లిస్తే ప్రభుత్వం మీద నెలకు రూ.5.2 కోట్ల భారం పడనుంది. సంవత్సరానికి అయ్యే ఖర్చు 62.4 కోట్లు.
ఐతే ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటన్నదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. జగన్ కుటుంబానికి చెందిన సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచడానికి, అదే సమయంలో వాలంటీర్లకు ప్రయోజనం చేకూర్చడానికే ఈ నిర్ణయం అంటున్నారు.
కరోనా టైంలో మిగతా పత్రికల్లాగే సాక్షి పేపర్ సర్క్యులేషన్ బాగా పడిపోయింది. అప్పట్లో దాని గురించి ఏ పత్రికా పెద్దగా పట్టించుకోలేదు. కానీ సర్క్యులేషన్ మరీ పడిపోతే.. ప్రకటనల ఆధాయం కూడా ఆ మేరకు తగ్గుతుంది. త్వరలో సర్క్యులేషన్ సర్వే జరగనున్న నేపథ్యంలో అన్ని పత్రికలూ అప్రమత్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే సాక్షి సర్క్యులేషన్తో పాటు ఆదాయం కూడా పెంచడానికే ఈ నిర్ణయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సాక్షి పేరు చెప్పకపోయినా.. వాలంటీర్లందరూ ఆటోమేటిగ్గా ఆ పత్రికనే వేయించుకుంటారని, కాబట్టి ఈ నిర్ణయంతో ఒకేసారి సాక్షికి రెండున్నర లక్షలకు పైగా సర్క్యులేషన్, అలాగే నెలకు రూ.5 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని, ప్రజా ధనాన్ని ఇలా సాక్షికి మళ్లిస్తున్నారని విమర్శలు మొదలయ్యాయి.