వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆ వీడియోకు ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించాలని ఆ వీడియో సంగతి తేల్చాలని ప్రతిపక్షాలు సహా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, వైసీపీ నేతలు, వైసీపీ మహిళా నేతలు మాత్రం అదేదో నాలుగు గోడల మధ్య జరిగిన వ్యవహారం అంటూ మాధవ్ ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మాధవ్ వ్యవహారంపై ఇంకెక్కడి కేసు అంటూ మంత్రి ఉషాశ్రీ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉషశ్రీ వ్యాఖ్యలపై టిడిపి నేత వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు.
మాధవ్ బూతు వ్యవహారంపై ఇంతవరకు రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్ లోనూ కేసు రిజిస్టర్ చేయలేదు, దర్యాప్తు చేపట్టలేదంటూ వర్ల రామయ్య ఆరోపించారు. అంతేకాదు, ఆ బూతు వీడియోను ఇంతవరకు ఏ ల్యాబ్ కు పరీక్ష నిమిత్తం పంపలేదని వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఆ డర్టీ పిక్చర్ పై ఓవైపు రాష్ట్రమంతా అట్టుడికిపోతోందని, కానీ, మహిళా మంత్రి ఉషశ్రీ గారేమో ఇంకెక్కడి కేసు అంటున్నారని జగన్ ను ప్రశ్నించారు.
మరోవపు మాధవ్ వీడియోపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కూడా ఘాటుగా స్పందించారు. కామపిశాచి మాధవ్ ను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కులాల మధ్య చిచ్చుపెట్టడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం వంటి ఎన్నో పనులకు జగన్ పాల్పడ్డారని ఆరోపించారు. అయితే తాను జగన్ ప్రయత్నాలను పటాపంచలు చేస్తూ సంచలన ఫోరెన్సిక్ రిపోర్ట్ తో మీడియా ముందు పట్టాభిరామ్ సంచలన ప్రకటన చేశారు.