వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ టేప్స్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, అది మార్ఫింగ్ చేసిన వీడియో అని గోరంట్ల వాదిస్తుండగా…ఆ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవేనని ప్రతిపక్ష నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దీంతో, అసలు ఆ వీడియో టేప్ నకిలీదా..నిజమైనదా అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వీడియో విజయవాడ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ చేరింది. అయితే, వాస్తవానికి హైదరాబాద్ ల్యాబ్ కు వెళ్లాల్సిన వీడియో బెజవాడకు చేరడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తాను ఎంపీ గోరంట్ల మాధవ్ అభిమానిగా చెప్పుకుంటున్న వెంకటేష్ అనే వ్యక్తి అనంతపురం టూటౌన్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఎంపీ మాధవ్ పరువుకు భంగం కల్గించేలా ఈ వీడియోను సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ప్రకారం పోలీసులు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని తెలుస్తోంది. వెంకటేష్ పోలీసులకు ఇచ్చిన ఆధారాలను ఆ వీడియోతోపాటు విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారని ఆఫ్ ది రికార్డ్ తెలుస్తోంది. అయితే, వీడియో టేప్ తమకు అందిందన్న విషయాన్ని విజయవాడ ల్యాబ్ వర్గాలు ధృవీకరించాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే అనంతపురం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
మరోవైపు, రెండు రోజుల క్రితం ఏపీ డీజీపీకి మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. మాధవ్ వీడియో టేప్‌లను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ లేఖ ప్రకారం కూడా చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఈ తరహా వీడియోలను పరిశీలించి, పరీక్షించే టెక్నాలజీ హైదరబాద్‌లోని సెంట్రల్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉంది. దీంతో, ఆ వీడియోను అక్కడికే పంపాల్సి ఉంది. కానీ, ఆ వీడియో తమకు రాలేదని హైదరాబాద్ సెంట్రల్ ల్యాబ్ అధికారులు చెబుతున్నారు. ఇక, ఇప్పటికే వీడియో టేప్ ల్యాబ్‌కు పంపామని హోంమంత్రి తానేటి వనిత మీడియా ముందు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో, బెజవాడ ల్యాబ్ కు ఆ వీడియో చేరిందన్న విషయం నిర్ధారణ అయింది.
అయితే, ఈ వీడియోను ఏపీలో ఉన్న విజయవాడ ల్యాబ్ కు పంపడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇక, ఆ వీడియో వ్యవహారం తేలినట్లేనని, కొద్ది రోజులు నాన్చిన తర్వాత అది ఫేక్, మార్ఫింగ్ వీడియో అని తేల్చేస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రభావితం చేయడానికి అవకాశమున్న విజయవాడ ల్యాబ్ నకు ఆ వీడియోను పంపడంతోనే జగన్ చిత్తశుద్ధి ఏమిటో అర్థమైందని విమర్శిస్తున్నారు. పారదర్శకంగా ఆ వీడియో గుట్టురట్టు చేయాలంటే ఏపీ, తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రంలో ఉన్న ల్యాబ్ నకు ఆ వీడియో పంపాలని, కనీసం హైదరాబాద్ కైనా పంపి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోరంట్ల వీడియో గుట్టు అటకెక్కినట్లేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.