నెల్లూరు జిల్లాలోని పెన్నానదిపై నిర్మించిన సంగం బ్యారేజీని సీఎం జగన్ రిబ్బన్ కట్ చేసి మరీ అట్టహాసంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, సొమ్మొకడిది సోకొకడిది అన్నరీతిలో జగన్ యవ్వారం ఉంటుందని..అదే తరహాలో టీడీపీ హయాంలో 90 శాతం పూర్తయిన ఈ బ్యారేజీని జగన్ తన ఖాతాలో వేసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. సంగం బ్యారేజీకి దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టడం మినహా జగన్ చేసిందేమీలేదని…పని మనది – ప్రచారం తనది అని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేశారు. మూడేళ్ళలో 10 శాతం పనులు కూడా సరిగా పూర్తి చేయలేని అసమర్థ సీఎం రిబ్బన్ కటింగ్ అంటే మాత్రం ముందుంటాడు అంటూ గోరంట్ల ఎద్దేవా చేశారు. సంగం బ్యారేజీలో రెక్కల కష్టం చంద్రబాబుదని… రిబ్బన్ కటింగ్ జగన్ రెడ్డిదని చురకలంటించారు. రాష్ట్రంలో జలవనరుల శాఖ నిద్రపోతోందని గోరంట్ల ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఆగిపోయాయని, అయినా ఆ శాఖ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
82 శాతం చంద్రబాబు పూర్తి చేశారని, మిగిలిన 18 శాతం జగన్ పూర్తి చేయలేక పోయారని ఎద్దేవా చేశారు. నెల్లూరులో కురిసిన వర్షాలకు గ్రామాలు నీటమునిగాయని, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని…అయినా, ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. 2021 జనవరికి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని 2019లో జగన్ ఆర్భాటంగా ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు.
రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టు పనులు ఆగిపోయేలా జగన్ చేశారని దుయ్యబట్టారు. 20 శాతం పనులు పూర్తి చేసివుంటే జయలలిత నగర్, ఇస్లాంపేట, బుజ్జమ్మడొంక, కొత్తయ్య ఎస్టేట్ చౌదరి కాలనీలు మునిగేవి కావని అన్నారు. పులిచింతల ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారని, పోలవరాన్ని గుదిబండగా మార్చి నిర్వాసితులను గంగలో కలుపుతున్నారని గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments 1