విశాఖపట్నంలో మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో జగన్ సర్కార్ ఎంవోయూ కుదుర్చుకుంది. సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీసి రీసైక్లింగ్ చేసే సంస్థగా దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ఆ కార్యక్రమం తర్వాత సీఎం జగన్ కు ఉన్నపళంగా పర్యావరణంపై ప్రేమ పుట్టుకొచ్చింది. దీంతో, ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తూ జగన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
2027 నాటికి ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు జగన్. అయితే జగన్ కు సడెన్ గా పర్యావరణంపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ పై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన కామెంట్లు చేశారు. ప్లాస్టిక్ నిషేధం దిశంగా జగన్ ఇచ్చిన పిలుపు వెనుక వేరే కారణం ఉండి ఉంటుందని గోరంట్ల అనుమానం వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ రెండో తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఉందని, దానినే జగన్ టార్గెట్ చేసి ఉంటారని గోరంట్ల ఆరోపించారు. జగన్ ప్లాస్టిక్ ఫ్లెక్సీలను బ్యాన్ చేయడాన్ని చూస్తుంటే హలో బ్రదర్ సినిమాలో విలన్ గుర్తుకు వస్తున్నాడని గోరంట్ల సెటైర్లు వేశారు. పవన్ పుట్టినరోజున రాష్ట్రంలో ఆయన ఫ్లెక్సీలు కనిపించకూడదు అన్న దురుద్దేశంతోనే జగన్ హఠాత్తుగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధించారని గోరంట్ల ఆరోపించారు.
పవన్ బర్త్ డే సందర్భంగా ఆల్రెడీ జనసేన కార్యకర్తలతో పాటు ఆయన అభిమానులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ సైజు ఫ్లెక్సీలను పెడుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ ఈ ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించాలని నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పవన్ ట్వీట్లు చేసిన కొద్దిసేపటికే, గోరంట్ల కూడా జగన్ పై విమర్శలు గుప్పించారు. మరి, ప్రతిపక్షాల ఆరోపణలకు వైసీపీ నేతలు ఏ విధంగా జవాబిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.