అర్థరాత్రి పన్నెండున్నర గంటల వేళలో హోటల్ కు వచ్చిన కొందరు బిర్యానీ ఆర్డర్ చేశారు. సమయం మించిపోవటంతో లేదని చెప్పారు. దీనిపై మాటా మాటా పెరగటమే కాదు..సిబ్బంది మీద దాడికి పాల్పడిన దారుణ ఉదంతం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అత్తాపూర్ ఉప్పర్ పల్లి పిస్తా హౌస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
అరుగురు వ్యక్తులు అర్థరాత్రి పన్నెండున్నర గంటల వేళలో వచ్చి బిర్యానీ అడిగారు. అప్పటికే కిచెన్ క్లోజ్ కావటంతో.. బిర్యానీ లేదని చెప్పారు. దీంతో వచ్చిన వారు గొడవకు దిగారు.
మాటా మాటా పెరిగి దాడులు చేసుకునే వరకు వెళ్లింది. అక్కడితో ఇష్యూ ఆగలేదు. హోటల్లో అప్పటికే తింటున్న వారిపైనా దాడికి పాల్పడ్డారు. దీంతో వారంతా భయంతో పరుగులు తీశారు. ఒకచోట ఐదుగురు భోజనం చేస్తుండగా.. అక్కడకు వెళ్లిన వారు వారిని తింటున్న ఆహారాన్ని వదిలేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో అందులోని వారు ఒకరు ఎదురు తిరిగారు. దీంతో.. వారిపైనా దాడికి పాల్పడ్డారు. టేబుళ్లు.. ప్లేట్లను వారిపై విసిరి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ దారుణమంతా సీసీ కెమేరాలో రికార్డు అయ్యింది. ఈ రచ్చపై స్పందించిన యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. స్పందించిన వారు అక్కడకు వచ్చారు. గొడవకు దిగిన వారిలో ఒక రౌడీ షీటర్.. అతడి స్నేహితులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ తరహా ఉదంతాలు హైదరాబాద్ మహానగర బ్రాండ్ ఇమేజ్ కు ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.