ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీకి ఏకైక రాజధాని అమరావతేనంటూ రైతులు మహా పాదయాత్ర 2.0కు శ్రీకారం చుట్టారు. మరోవైపు, వైసీపీ నేతలు మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీకి రాజధాని ఏది అన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా తేల్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని కేంద్రం తాజాగా పరోక్షంగా ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై సెప్టెంబర్ 27న కేంద్ర ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పలు అంశాలపై ఏపీ, తెలంగాణల సీఎస్ లతోపాటు పలువురు అధికారులతో కేంద్రం చర్చించనుంది. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్థికపరమైన సమస్యలు తదితర అంశాలపై చర్చించాల్సి ఉంటుందని ఇరు రాష్ట్రాల సిఎస్ లకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఈ సమావేశం అజెండాలో వైసీపీ చెబుతున్నట్లుగా మూడు రాజధానుల ప్రస్తావన లేదు. కానీ, ఏపీ నూతన రాజధానికి కావలసిన నిధుల కేటాయింపులు అనే అంశం మాత్రం ఆ అజెండాలో ఉంది. కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్రం సహకారం, నూతన విద్యాసంస్థల స్థాపన, రాజధాని నుంచి రాపిడ్ రైలు అనుసంధానం వంటి అంశాలపై చర్చించాలని కేంద్రం వెల్లడించింది. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు సంబంధించి ఇప్పటివరకు కొలిక్కిరాని అంశాలపై చర్చించాలని ఈ అజెండాలో పేర్కొంది.
గతంలో రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోది అని చెప్పి మూడు రాజధానులకు పరోక్షంగా కేంద్రం మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల కాలంలో బీజేపీ, వైసీపీల మధ్య గ్యాప్ వచ్చిందన్న ప్రచారం నేపథ్యంలో అమరావతికి బీజేపీ పరోక్షంగా మద్దతు తెలపడం చర్చనీయాంశమైంది. కొద్ది నెలల క్రితం అమరావతికి రాష్ట్ర బీజేపీ నేతలు మద్దతు తెలపాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా చెప్పిన సంగతి తెలిసిందే.
Comments 1