ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కీలక మాట ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి వచ్చింది. గడిచిన కొన్నేళ్లుగా లోక్ సభ సీట్ల సంఖ్య పెంపు గురించి అన్ని రాజకీయ పక్షాలు ఎదురుచూస్తున్న పరిస్థితి. తాజాగా కొత్త పార్లమెంటు భవనం ప్రారంభాన్ని పురస్కరించుకొని ప్రసంగించిన నరేంద్ర మోడీ నోటి నుంచి.. రానున్న రోజుల్లో లోక్ సభ సీట్ల సంఖ్య మరింత పెరగనున్నట్లు చెప్పారు.
‘లోక్ సభ సీట్లు పెరిగితే మరింత ఎక్కువమంది కూర్చునే విధంగాకొత్త పార్లమెంట్ భవనంలో వెసులుబాటు ఉంటుంది. ఆధునిక సాంకేతికతో పార్లమెంటును నిర్మించాం. ఇతర దేశాలకు భారతదేశం సాగించిన ప్రయాణం ఆదర్శంగా నిలుస్తుందన్న మోడీ.. వచ్చే పాతికేళ్లు దేశాభివ్రద్ధికి పాటుపడాలని కోరారు. అందరిలోనూ దేశమే ముందు అన్న భావన కలగాలన్న మోడీ.. భారత్ విజయ ప్రస్థానం రాబోయే రోజుల్లో మిగిలిన దేశాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. పార్లమెంటులో తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే తరాలను బలోపేతం చేస్తుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
‘ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. ప్రతి దేశ చరిత్రలో కొన్ని సందర్భాలు శాశ్వితంగా నిలిచిపోతాయి. అమ్రత్ మహోత్సవ్ వేళ.. నూతన పార్లమెంటు భవనాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇది కేవలం భవనం మాత్రమే కాదు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక. కొత్త పార్లమెంటు భవనం భారతీయుల ధ్రడ సంకల్పాన్ని చాటి చెబుతుంది. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఆధునిక భారత్ కు కొత్త పార్లమెంటు అద్దం పడుతుంది. పాత పార్లమెంట్ భవనంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి’’ అని మోడీ వెల్లడించారు.
పవిత్రమైన సెంగోల్ ను పార్లమెంటులో ప్రతిష్ఠించామని.. సెంగోల్.. చోళుల కాలంలో కర్తవ్య నిష్టకు ప్రతీకగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిదన్న మోడీ.. భారత్ డెవలప్ అయితే.. ప్రపంచం కూడా డెవలప్ అవుతుందన్నారు. ప్రజల ఆశల్ని.. ఆకాంక్షల్ని పార్లమెంట్ గౌరవిస్తుందన్నారు. లోక్ సభ ప్రాంగణం నెమలి రూపంలో.. రాజ్యసభ ప్రాంగణం కమలాన్ని ప్రతిబింబిస్తోందన్న మోడీ.. రానున్న పాతికేళ్లలో భారత్ డెవలప్డ్ దేశంగా నిలుస్తుందన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలోనాలుగు కోట్ల మంది పేదలకు ఇళ్లు కట్టించినట్లుగా పేర్కొన్నారు.