మొన్నటికి మొన్న నిండుగా ఉన్న మహారాష్ట్రలోని శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే సర్కారును కూకటి వేళ్లతో సహా పెకలించేసి.. తమ సర్కారును ఏర్పాటు చేసుకున్న బీజేపీ నాయకులు.. ఇప్పుడు తీర ప్రాంత రాష్ట్రం. . గోవాలో కాంగ్రెస్‌ను లేకుండా చేయాలనే వ్యూహంపై కన్నేశారు.
ఇక్కడ అధికారాన్ని దక్కించుకున్నప్పటికీ.. బొటా బొటీ మెజారిటీ ఉన్నందున కాంగ్రెస్‌ను చీల్చేందుకు కమల నాథులు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీలో భారీ చీలిక వచ్చింది. ఇది.. బీజేపీ అధికారం సుస్తిరం చేసుకునేందుకు దారితీస్తున్న పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు.
గోవాలో కాంగ్రెస్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. మొత్తం 11 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో విపక్ష నేతగా ఉన్న మైఖెల్ లోబోను ఆ పదవి నుంచి కాంగ్రెస్ తప్పించింది. లోబో, దిగంబర కామత్‌లు బీజేపీతో కలిసి కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
మైఖెల్ లోబో తన భార్యతో కలిసి.. గోవా సీఎంను కలిశారు. దీంతో గోవాలో విపక్ష కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడింది. కాంగ్రెస్ పార్టీకి గోవా శాసనసభలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
వీరిలో ఐదుగురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. కాంగ్రెస్ శాసనసభాపక్షంలో చీలిక తెచ్చేందుకు మైఖెల్ లోబో, మాజీ సీఎం దిగంబర కామత్ అధికార బీజేపీతో కలిసి పోయారనేది వాస్తవం. విపక్ష నేతగా ఉన్న లోబోను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించారు.
లోబో, దిగంబర కామత్‌లపై చర్యలు తీసుకుంటామని సీనియర్ నేతలు స్పష్టం చేశారు. గోవాలో ప్రతిపక్షాన్ని అంతం చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారన్న ఊహాగానాల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే లోబో, ఆయన భార్య.. బీజేపీ నేత, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను కలిశారు. ఈ విషయంపై స్పందించిన సావంత్.. సీఎంను కలిసేందుకు చాలా మంది వస్తుంటారని, అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున తాను ఆ పనుల్లో నిమగ్నమయ్యానని చెప్పుకొచ్చారు. ఇత పార్టీల సమస్యలపై తాను మాట్లాడబోనని అన్నారు.
మరోవైపు గోవాలో పరిస్థితులను చక్కదిద్దేందుకు సీనియర్ నేత ముకుల్ వాస్నిక్‌ను గోవా వెళ్లాలని అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించారు. గోవా శాసనసభ సామర్థ్యం 40 మంది ఎమ్మెల్యేలు కాగా అధికార బీజేపీకి 20 మంది శాసనసభ్యుల బలం ఉంది.
ముగ్గురు స్వతంత్రులు, ఇద్దరు ఎంజీపీ సభ్యుల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే.. కాంగ్రెస్ నేతలు తరచుగా.. బీజేపీప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను లేకుండా చేయాలనే వ్యూహానికి బీజేపీ నేతలు స్కెచ్ వేయడం గమనార్హం.