జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆ పార్టీకి ఎంతో కీలకమైన గ్లాసు గుర్తు కోల్పోయిన సంగతి తెలిసిందే. రకరకాల కారణాల వల్ల ఏపీ, తెలంగాణలో జరిగిన పలు ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడం, పోటీ చేసినా నిబంధనల ప్రకారం నిర్ణీత శాతం ఓట్లు పొందకపోవడం వంటి కారణాల నేపథ్యంలో జనసేన గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఆ క్రమంలోనే కొద్ది నెలల క్రితం గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో సీఈసీ చేర్చింది. ఎన్నికలకు మరో 6 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో జనసేనకు గ్లాసు గుర్తు లభిస్తుందా లేక మరేదైనా గుర్తు వస్తుందా అన్న సందిగ్ధత ఏర్పడింది.
ఒకవేళ వేరే గుర్తు లభిస్తే..దానిని జనంలోకి బలంగా తీసుకువెళ్లేందుకు ఈ ఆరు నెలల సమయం సరిపోదు. ఇటువంటి పరిస్థితులలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఊరటనిచ్చింది. తాజాగా గ్లాసు గుర్తును జనసేన పార్టీకే కేటాయిస్తున్నట్టు సీఈసీ ప్రకటించింది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ గ్లాసు గుర్తు తిరిగి రావడంతో జనసేన నేతలు, జనసైనికులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపై పోటీ చేశారు. ఏపీలో 137 శాసనసభ స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు బరిలోకి దిగారు. అంతకుముందు, గ్లాసు గుర్తు విషయంలో వారాహి యాత్ర ప్రారంభం సందర్భంగా పవన్ కు పేర్ని నాని కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గుడి దగ్గర చెప్పులు పోతే ఎవరో ఒక నిర్మాత కొనిస్తారని, కానీ ఆయన పార్టీకి ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు కూడా పోయిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. పార్టీ సింబల్ గాజు గ్లాసు గుర్తు ఎక్కడుందో వెతుక్కోవాలని, అది పోయి చాలాకాలమైందని నాని సెటైర్లు వేశారు.