ఏటా కొన్ని వేల మంది విద్యార్థులకు విద్యా సుగంధాలను అద్ది.. సమాజానికి మేలు చేస్తున్న సంస్థ గీతం విశ్వవిద్యాలయం. విశాఖలో దివంగత ఎంవీ ఎస్ ఎస్ మూర్తి స్థాపించిన ఈ సంస్థకు మన రాష్ట్రం, దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అలాంటి సంస్థపై రాజకీయ క్రీనీడ అలుముకుంది. మూర్తిగారి మనవడు.. బాలయ్యకు స్వయానా అల్లుడు మతుకుమిల్లి శ్రీ భరత్ ఈ సంస్థను నడిపిస్తున్నారు. అయితే, ఈయన గత ఏడాది ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అంటే.. టీడీపీలో కీలక పొజిషన్లో ఉన్నారు. దీంతో సర్కారు వారి కన్ను.. ఈ సంస్థపైనా పడింది.
గీతం యూనివర్సిటీకి కట్టడాలను ప్రభుత్వం కూల్చివేయించింది. అయితే, ఆయా కట్టడాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. మొత్తం 40 ఎకరాలపై ఈ వివాదాలు కోర్టు పరిధిలో ఉండగానే.. తీర్పు కూడా రాకుండానే సర్కారు పెద్దలు గీతంపై గన్ను ఎక్కుపెట్టినట్టుగా.. ఆయా కట్టడాలను కూల్చేయించారు. ఇది రాజకీయంగా దుమారం రేపింది. టీడీపీకి చెందిన వారి సంస్థ కాబట్టే ఇలా చేశారనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక, ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు.. గవర్నమెంట్ టెర్రరిజానికి ఇది పరాకాష్టగా మారిందని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
జగన్ అధికారంలోకి అడుగు పెట్టిన తర్వాత ఆయన కూల్చేవేతల దిశగానే అడుగులు వేస్తున్నారు. దాదాపు 10 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రజావేదికను నేలమట్టం చేశారు. ఇటీవల టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బంహరి నివాసంలోని ప్రహరీని కూలగొట్టారు. ఇక, ఇప్పుడు గీతం యూనివర్సిటీపై పడ్డారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి.. రాజకీయాల్లో సాధింపులు ఉంటాయే తప్ప కక్ష సాధింపులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంతకుమునుపు లేవనే చెప్పాలి. ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బతీయడం కోసం ప్రచారం చేసుకుంటారే తప్ప.. ఆస్తులు ధ్వంసం చేయడం.. కేసులు పెట్టి జైళ్లకు పంపించడం వంటివి జగన్ కాలంలోనే కనిపిస్తున్నాయని అంటున్నారు.
తాజాగా గీతం ఘటన కూడా కక్ష సాధింపులో భాగంగానే ఉందని పరిశీలకులు సైతం భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దీనిపై ఘాటుగానే స్పందించారు. గవర్నమెంట్ ఒక ఉగ్రవాదిగా వ్యవహరిస్తోందని, ఈ వైఖరితో ఇప్పటికే అనేక పరిశ్రమలు వెళ్లిపోయాయని, ఇతర రాష్ట్రాల్లో కొత్త పనులు జరుగుతుంటే.. మన దగ్గర ఉన్నవి కూల్చుకునే పనిలో పడ్డారని, దీంతో రాష్ట్రానికి ఉన్న మంచి పేరు పోయి బీహార్ ఆఫ్ సౌత్ ఇండియా అనే పరిస్థితికి ఏపీ దిగజారిపోతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
ఇక, గీతం విషయానికి వస్తే.. విద్యార్థులకు విద్యను అందించడమేకాదు.. సామాజిక బాధ్యతగా కూడా సంస్థ ముందుకు అడుగులు వేసింది. కరోనా కాలంలో సామాజిక బాధ్యతగా 2,590 మంది కోవిడ్ పేషంట్లకు చికిత్స అందించింది. అదేవిధంగా కాలేజీలో కొన్ని గదులను క్వారంటైన్ కేంద్రాలుగా ప్రభుత్వానికి ఇచ్చింది.
ఇంత చేసినా కూడా సర్కారు మాత్రం కక్ష సాధింపు రాజకీయాలను ఆపలేదని స్థానికులు సైతం విమర్శిస్తుండడం గమనార్హం. ఈ పరిణామంపై సోషల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి. పైగా కోర్టులో ఉన్న కేసులపై తీర్పులు వచ్చే వరకు కూడా వెయిట్ చేయలేక పోతున్నారా? అంటూ.. విమర్శలు వస్తున్నాయి. దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.