‘నిర్భయ`ఘటన దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపడంతో దేశంలోని మహిళల రక్షణకు నిర్భయ చట్టాన్ని తెచ్చారు. పోక్సో చట్టానికి సవరణలు చేశారు. ఎన్ని చట్టాలు తెచ్చినా…ఎన్ని సవరణలు చేసినా….దేశంలో పది నెలల చిన్నారి మొదలు పండు ముసలి వరకు మహిళలపై అకృత్యాలు, లైంగిక దాడులు, అత్యాచారాలు ఆగడం లేదు. ఇక, కలియుగంలో మహిళలు కేవలం సమాజంలోని దుశ్శాసనులతోనే కాదు…ఇంట్లోని దుశ్శాసనులతో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి.
వావి వరసలు మరచిపోయిన కామాంధులు కన్నకూతుళ్లపైనే అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఆడపిల్లగా పుట్టడమే తాము చేసిన పాపమా అనిపించేలా ఎంతోమంది అబలలు కామాంధుల చేతుల్లో అన్యాయంగా బలవుతున్నారు. అంతరిక్షంలో రకరకాల అన్వేషణలు జరుగుతున్నా…అబలల ఆవేదన మాత్రం అలాగే ఉంది. ఇంటా, బయటా, పని చేసే చోటా, ప్రయాణాల్లో…తమపై జరుగుతున్న అకృత్యాలను కొందరు బయటకు చెప్పలేక బాధను పంటి బిగువున భరిస్తున్నారు. మరికొందరు సున్నిత మనస్కులు…ఈ దారుణాలను తట్టుకోలేక, బయటకు చెప్పుకోలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.
ఈ తరహాలోనే లైంగిక, మానసిక వేధింపులకు గురైన 11వ తరగతి విద్యార్థిని…ఈ లోకంలో తానుండలేనంటూ సూసైడ్ నోట్ రాసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆ నోట్ లో చిన్నారి రాసిన ఓ మాట ఎంతోమంది హృదయాలను కలచివేస్తోంది. చెన్నైలోని పూనమల్లే ప్రాంతానికి చెందిన 11వ తరగతి విద్యార్థిని కొద్దిరోజుల క్రితం అదృశ్యమైంది. ఆమె కోసం వెతుకుతున్న పోలీసులకు తాజాగా ఆమె డెడ్‌బాడీ దొరికింది. దర్యాప్తులో భాగంగా ఆమె ఇంట్లో దొరికిన సూసైడ్ నోట్ వైరల్ అయింది. ‘తల్లి గర్భం, సమాధి మాత్రమే మహిళకు సురక్షితమైన ప్రదేశాలు’ అంటూ ఆ విద్యార్థిని రాసిన మాటలు ఎందరినో కదిలించాయి. లోకంలో మహిళల దీనస్థితికి అద్దం పట్టేలా ఉంది.
విచారణలో భాగంగా ఆ విద్యార్థిని తల్లి సంచలన విషయాలు చెప్పింది. 9వ తరగతి చదువుతుండగా ఆ ప్రైవేటు స్కూల్లోని ఓ ఉపాధ్యాయుడి కుమారుడు తన కుమార్తెను వేధించేవాడని పోలీసులకు వివరించింది. ఆ వేధింపుల కారణంగానే వేరే స్కూల్లో చేర్పించినట్లు తెలిపింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆ కోణంలోనూ విచారణ చేస్తున్నారు.