కాంగ్రెస్ పార్టీకి జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ రాజకీయ నేత గులాంనబీ అజాద్ ఆగస్టు 26న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ విధివిధానాలను తప్పుబడుతూ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన జీ-23 నేతలలో గులాం నబీ కూడా ఒకరు. కాంగ్రెస్ సమగ్రంగా నాశనమైందని, పార్టీ సంప్రదింపుల యంత్రాంగం మొత్తం కూలిపోయిందని రాహుల్ గాంధీపై గులాం నబీ గతంలో మండిపడ్డారు.
ఈ క్రమంలోనే ఆజాద్ కొత్త పార్టీ పెట్టబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే నేడు ఆజాద్ తన కొత్త పార్టీ పేరు, జెండా, ఎజెండాను ప్రకటించారు. ‘డెమొక్రటిక్ అజాద్ పార్టీ’ పేరుతో తన కొత్త పార్టీని ఆజాద్ లాంచ్ చేశారు. తన పార్టీ జెండాను కూడా ఆయన ఆవిష్కరించారు. తమది ప్రజాస్వామ్య పార్టీ అని, తమకంటూ స్వతంత్ర ఆలోచన, సిద్ధాంతాలు ఉంటాయని అజాద్ ప్రకటించారు.
ఎన్నికల సంఘం వద్ద పార్టీని నమోదు చేసుకోబోతున్నామని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చనీ, వాటికి తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. నీలం, తెలుపు, పసుపు రంగుల కలయికతో తమ పార్టీ జెండా రూపుదిద్దుకుందని తెలిపారు. ఇందులో పపుసు రంగు అన్నది సృజనాత్మకత, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, తెలుపు అన్నది శాంతికి చిహ్నం అని, నీలం రంగు స్వేచ్ఛ, ఊహలకు ప్రతిరూపం అని అజాద్ పేర్కొన్నారు.
జెండాలో ఖాళీ స్థలం…ఊహలను, సముద్రపు లోతుల నుంచి ఆకాశం ఎత్తు వరకు ఉన్న పరిమితులను సూచిస్తుందని తెలిపారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం, దాని నివాసితుల భూమి, ఉద్యోగ హక్కులను పరిరక్షించడం తన పార్టీ ప్రధాన ఎజెండా అని గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు.