అమరావతిలోని ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలను సీఎం జగన్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే, అమరావతిని నిర్వీర్యం చేసేందుకే జగన్ అక్కడ ఈ కార్యక్రమం చేపట్టారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతి రాజధానిపై జగన్ కు ప్రేమ లేదని, అందుకే ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. నాలుగేళ్లుగా అమరావతి పేరు కూడా ఎత్తని జగన్ ఈ రోజు అమరావతి మనందరిది, తాను పేదల పక్షాన ఉన్నాను అంటూ స్టేట్ మెంట్లు ఇవ్వడంపై పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.
పేదల పక్షాన ఉన్నానని జగన్ చేసిన కామెంట్లు ఈ తరానికి అతిపెద్ద పొలిటికల్ జోక్ అని గంటా సెటైర్లు వేశారు. అమరావతి రైతుల ప్రాథమిక హక్కులను కాలరాసిన జగన్…రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకుడిలా పేదరికపు హాస్యాన్ని జగన్ బాగా రక్తికట్టిస్తున్నారని గంటా చురకలంటించారు. కోర్టు తుది తీర్పు ఇవ్వకుండానే సీఎం అయిన జగన్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఏమిటని ప్రశ్నించారు. అలా చేయడం నిరుపేదల జీవితాలతో ఆడుకోవడమేనని మండిపడ్డారు. ఆర్ 5 జోన్ విషయంలో తుది తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ఇంటి నిర్మాణానికి ఖర్చు చేసిన ప్రజాధనానికి లెక్క ఎవరు చెబుతారు అని నిలదీశారు.
జడన్ మూర్ఖత్వ్ వల్త అమాయక పేదలు బలవుతారని దుయ్యబట్టారు. నాలుగున్నరేళ్లుగా నిద్రపోయిన జగన్…కోర్టు తుది తీర్పు రాకముందే పట్టాలు పంపిణీ, శంకుస్థాపనలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. పేదల సంక్షేమం అంటూ అమరావతి మాస్టర్ ప్లాన్ను ధ్వంసం చేస్తున్నారని, ఇళ్ల నిర్మాణం పేరుతో అమరావతిని నాశనం చేసే నాటకాలాడుతున్నారని విమర్శించారు. 2019లో “ఒక్క అవకాశం” జనం ఇచ్చారని, తమ తప్పు తెలుసుకొని 2024 ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు.