మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలిపై గత మూడేళ్లుగా ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలో కీలక నేతగా పేరున్న గంటా కొంతకాలంగా టిడిపికి దూరంగా ఉంటున్నారు. అయితే, ఆ క్రమంలో గంటా వైసీపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ పుకార్లకు తగ్గట్టుగానే టిడిపి అధినేత చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమాలకు సైతం గంటా డుమ్మా కొట్టారు.
అయితే ఆ తర్వాత మనసు మార్చుకున్న గంట టిడిపిలోనే కొనసాగుతున్నా అన్న సంకేతాలు ఇచ్చారు. కొద్ది నెలల క్రితం విశాఖలో చంద్రబాబు పర్యటన సందర్భంగా గంటా ప్రత్యక్షం కావడంతో ఆయన టిడిపిలోనే ఉన్నారని కన్ఫర్మ్ అయింది. అయితే, ఆ తర్వాత గంటా పొలిటికల్ గా ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా తాజాగా మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవితో గంటా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అయితే, మెగా ఫ్యామిలీకి సన్నిహితుడిగా పేరున్న గంటా… చిరంజీవిని మర్యాదపూర్వకంగానే కలిశారని టాక్ వస్తోంది. ‘గాడ్ ఫాదర్’ చిత్రం హిట్ అయిన సందర్భంగా చిరును అభినందించేందుకే గంటా హైదరాబాద్ వచ్చారని ప్రచారం జరుగుతోంది. కానీ, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ కాదని రాజకీయ వర్గాల్లో టాక్ వస్తుంది. భవిష్యత్తులో తాను జనసేనకు మద్దతిస్తానేమో అంటూ చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపాయి.
త్వరలోనే గంటా జనసేనలో చేరబోతున్నారని, రాబోయే ఎన్నికల్లో విశాఖ నుంచి జనసేన తరఫున గంటా చక్రం తిప్పే అవకాశం ఉందని పుకార్లు వస్తున్నాయి. అందుకే చిరుతో ఆయన భేటీ అయ్యారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2009లో ప్రజారాజ్యం తరఫున గంట ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే.