రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు మనసు మళ్లీ భీమిలి వైపు మళ్లిందా? వచ్చే ఎన్నికల్లో ఆయన ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నారా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు విశాఖ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది.
1999లో తన రాజకీయ జీవితం ప్రారభించిన గంటా పోటీచేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1999లో తెలుగు దేశం పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత 2004లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత తిరిగి టీడీపీ గూటికి చేరి 2014లో భీమిలి నుంచి గెలిచారు. చంద్రబాబు సర్కారులోనూ మంత్రిగా పని చేశారు. కానీ గత ఎన్నికల్లో వివిధ రాజకీయ సమీకరణాల దృష్ట్యా టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. జగన్ హవాను తట్టుకుని విజయం సాధించారు.
గంటా శ్రీనివాస రావు ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారనే అంచనాలు ఉండడంతో విశాఖ ఉత్తర నియోజకవర్గం సీటు కచ్చితంగా టీడీపీకే దక్కుతుందనే అభిప్రాయాలు నిజమయ్యాయి. మరోవైపు వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ భీమిలిలో పోటీ చేయడంతో గంటా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి మారారానే వ్యాఖ్యలు అప్పుడు వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పరిస్థితులు గంటాకు అనుకూలంగా లేవని టాక్.
ప్రజలకు ఆయన అందుబాటులో ఉండడం లేదని నియోజకవర్గ అభివృద్దికి ఎలాంటి పనులు చేపట్టడం లేదనే అభిప్రాయాలు జనాల్లో వ్యక్తమవుతున్నాయి. పైగా చంద్రబాబు, లోకేశ్‌తో కూడా ఆయనకు గ్యాప్ వచ్చిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ పొత్తు కొనసాగితే విశాఖ నార్త్‌లో విష్ణుకుమార్ రాజ్ గంటాకు గట్టి ప్రత్యర్థిగా మారే అవకాశం ఉంది. వైసీపీ ఇంఛార్జ్ కెకె.రాజు కూడా అక్కడ పుంజుకుంటున్నారు. ఇటీవల కార్పోరేషన్ ఎన్నికల్లో నార్త్‌లో టీడీపీ దారుణంగా ఓడిపోవడమే అందుకు నిదర్శనం.
ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం మారేందుకు గంటా ప్రయత్నిస్తున్నారని టాక్. తనకు ఎంతగానో కలిసి వచ్చిన భీమిలిపై ఆయన మళ్లీ మనసు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే బరిలో దిగే అవకాశం కోసం ఆయన చూస్తున్నారని సమాచారం. ఒకవేళ తనకు అక్కట పోటీ చేసే ఛాన్స్ బాబు ఇవ్వకపోయినా తన కొడుకు రవితేజనైనా అక్కడి నుంచి బరిలో దింపాలనే పట్టుదలతో గంటా ఉన్నట్లు తెలుస్తోంది.
రవితేజకు కుదరని పక్షంలో తానే స్వయంగా భీమిలి నుంచి పోటీ చేసే విధంగా బాబుపై ఒత్తిడి తెచ్చేందుకు గంటా ప్రయత్నిస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గంటా శ్రీనివాసురావు ప్లాన్‌కు బాబు సరే అనడం అంత ఈజీ కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.