ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నాయకుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు రాజ్యసభ ఎన్నికల భయం పట్టుకుందని అన్నారు. ఎప్పుడో తను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. ఇప్పుడు ఆమోదించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కనీసం ఆమోదించే ముందైనా.. తనను సంప్రదించాలి కదా? అని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారనే కారణంగా.. కార్మికులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ.. తాను తనపదవికి రాజీనామా చేశానన్నారు. 2022లోనే తన రాజీనామా సమర్పించినట్టు వెల్లడించారు.
అయితే, అప్పటి నుంచి తన రాజీనామా పత్రాన్ని పెండింగులో పెట్టి.. ఇప్పుడు సాధారణ ఎన్నికలకు మూడు మాసాల ముందు దీనిని ఆమోదించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. దీని వెనుక రాజ్యసభ ఎన్నికల భయం పట్టుకుందని.. అందుకే ఈ ఎన్నికల నుంచి తనను దూరం చేసేందుకు ఉద్దేశపూర్వకంగా సీఎం జగన్ ఆడిస్తున్న వ్యవహారమని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని చేసినా.. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తన ఓటు హక్కు వినియోగించుకుంటానని గంటా చెప్పారు. అయితే.. దీనిపై ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై న్యాయ నిపుణులను సంప్రదించనున్నట్టు గంటా వివరించారు.
ఏం జరిగింది?
2021 చివరిలో విశాఖ ఉక్క ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తున్నట్టు పార్లమెంటులోనే కేంద్రం ప్రకటించింది. దీనిని ఎవరూ ఆపలేరని కూడా పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. దీంతో ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఇదే ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు.. అనూహ్యంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. దీనిని స్పీకర్ ఫార్మాట్లోనే చేశానని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా ఆయన మీడియా ముఖంగా అప్పట్లో స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను కోరారు.
కానీ, అప్పట్లో ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఈ రాజీనామాపై స్పీకర్ నిర్ణయం వెలువరించలేదు. దీనిని అందరూ మరిచిపోయారు కూడా. ఇలాంటి సమయంలో అనూహ్యంగా మంగళవారం స్పీకర్ తమ్మినేని గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదిస్తున్నట్టు చెప్పారు. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇది రాజకీయ దుమారానికి దారి తీసింది. త్వరలోనే రాష్ట్రంలో రాజ్యసభ సీట్లు ఖాళీ కానుండడం.. వాటికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గంటా రాజీనామాను ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది. దీనినే గంటా కూడా కార్నర్ చేశారు.